Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో సీక్రెట్ ఆపరేషన్ జరిగిన తీరును వివరించిన పోలీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ పోలీసులు హైకోర్టుకు రిమాండ్ రిపోర్టును శుక్రవారం అందజేశారు. అందులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు, సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన తీరును వెల్లడించారు. 

TRS MLAs purchase case.. The police explained the secret operation in the remand report
Author
First Published Oct 29, 2022, 10:55 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు శుక్రవారం రిమాండ్ రిపోర్టు అందించారు. ఇందులో చాలా ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. ఇది ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. నిందితులు ఎమ్మెల్యేలతో సంభాషించేటప్పుడు ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.ఇందులో నాలుగు సీసీ కెమెరాలు, వాయిస్ ను రికార్డు చేసే పరికరాలు ఉపయోగించామని పేర్కొన్నారు.

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర.. యాత్రలో పాల్గొన్న సినీ నటి పూనమ్ కౌర్..

పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన రోహిత్ రెడ్డి ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. రూ.వంద కోట్లు ఇస్తామని, టీఆర్ఎస్ ను అస్థిరం చేయాలని ఓ ముగ్గురు వ్యక్తులు తనను కోరారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఫిర్యాదు ప్రకారం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు. ముందుగానే ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కు చేరుకున్నామని, అక్కడి హాలులో నాలుగు సీసీ కెమెరాలు ఉంచామని తెలిపారు. నిందితుల సంభాషణను రికార్డు చేయడానికి ఎమ్మెల్యే జేబులో రెండు వాయిస్ రికార్డు పరికరాలను ఉంచామని పేర్కొన్నారు.

నిందితులు ఫామ్ హౌస్ కు వచ్చే సమయానికి కంటే ఐదు నిమిషాల ముందు అంటే 3 గంటల 5 నిమిషాలకు సీసీ కెమెరాలను ఆన్ చేశామని తెలిపారు. ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేతో కలిసి 3 గంటల 10 నిమిషాలకు ఫామ్ హౌస్ కు చేరుకున్నారని పేర్కొన్నారు. సరిగ్గా  గంట సమయం తరువాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, అలాగే రేగా కాంతారావులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. వారంతా కలిసి ముగ్గురు నిందితులతో దాదాపు 3.30 నిమిషాల పాటు సంభాషించారని వెల్లడించారు.

హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లొద్దు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు..

ముందస్తు ప్రణాళిక ప్రకారం సమావేశం ముగిసిన వెంటనే పని మనిషి ద్వారా కొబ్బరి నీళ్లు తెప్పించుకోవాలని ఎమ్మెల్యేకు సూచించామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో తాము హాల్ లోకి వస్తామని ఆయనకు తెలిపామని చెప్పారు. అందులో భాగంగా పని మనిషి బయటకు రాగానే తాము హాల్ దగ్గరికి చేరుకున్నామని పోలీసులు వివరించారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులు ఏ వివరాలూ చెప్పలేదని పేర్కొన్నారు. 

ఆ సమయంలో నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని, అలాగే అక్కడ అమర్చిన సీసీ కెమెరాలు, సంభాషణను రికార్డు చేసే పరికరాలను సీజ్ చేశామని తెలిపారు. ఆ పరికరాల ద్వారా రికార్డు అయిన సంభాషణలు అక్కడే వినేందుకు ప్రయత్నించామని, అందులో స్పష్టంగా వారి మాటలు రికార్డు అయ్యాయని పేర్కొన్నారు. అందులో తాము ఒక్కో శాసన సభ్యుడికి యాబై కోట్లు అందజేస్తామని నిందితులు మాట్లాడినట్టుగా వినిపించిందని తెలిపారు. గతంలో కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలానే చేశామని నిందితుడు రామచంద్రభారతి చెప్పినట్టుగా కూడా సంభాషణ ఉందని పేర్కొన్నారు.

మునుగోడు బై‌ పోల్‌: ఈ నెల 31 నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేసుకున్న బీజేపీ.. కారణం ఇదేనా..?

ఆ రికార్డింగులో ఆయన తుషార్ అనే వ్యక్తికి కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తోందని తెలిపారు. అలాగే నిందితులు పలువురికి పంపిన మెసేజ్ లు, వాట్సాప్ చాట్ ల స్క్రీన్ షాట్ లు తమ వద్ద ఉన్నాయని పోలీసులు రిమాండ్ రికార్డ్ లో పేర్కొన్నారు. నిందితుల కారులో లభించిన ఓ డైరీలో యాబై మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios