టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరు విమర్శలకు కారణమైంది.

టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరు విమర్శలకు కారణమైంది. తెలంగాణ సర్కార్.. నిరుపేద దళితులు ఆర్థిక చేయూత ఇవ్వడం కోసం దళిత బంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దళితులకు దశలవారీగా ఈ పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నారు. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రజాప్రతినిధులకు, అధికారులకు అప్పగించారు. 

అయితే కొన్నిచోట్ల దళిత బంధు పథకం వల్ల టీఆర్ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం.. రాజయ్య తన తమ్ముడు సురేష్ దళిత బంధు పథకానికి ఎంపిక చేయడమే. సురేష్ ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఉన్నారు. రాజయ్య తమ్ముడితో పాటు ఒకరిద్దరు స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా లబ్దిదారుల జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

దీంతో ఎమ్మెల్యే రాజయ్యపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దళిత బంధు ద్వారా అధికార పార్టీ నేతలకు మాత్రమే లబ్ది చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇక, రాజయ్య నిత్యం ఏదో ఒక వివాదంలో నిలవడం సర్వసాధారణంగా మారిన సంగతి తెలిసిందే. మరీ ప్రతిష్టాత్మక తీసుకున్న దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరుపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.