తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యేకు, ప్రభుత్వ అధికారులకు మద్య వివాదానికి కారణమైంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి ఎమ్మెల్యే దగ్గరుండి అటవీ భూములను దున్నిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ భూముల్లో కూడా హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి పోడు భూములు దున్నిస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ను నాయక్ ను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే నిబంధనలను అతిక్రమించి అటవీ భూములు దున్నిస్తుండటంతో అడ్డుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్‌ పరిధిలోని భూపతిపేట శివారు అటవీ భూముల్లో హరితహారం మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన తన అనుచరులతో కలిసి భూపతిపేట కంపార్టుమెంట్‌ 1037లోని అటవీ భూముల్లో ట్రాక్టర్లతో దున్నుతుండగా విషయం తెలుసుకున్న గూడూరు ఇన్‌చార్జి రేంజర్‌ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇలా అనుమతులు లేకుండా పోడు దున్నించడం సరికాదంటూ పనులను అడ్డుకున్నారు.

దీంతో అక్కడే వున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలుగుజేసుకుని డీఎఫ్‌వో అనుమతితోనే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన డీఎఫ్‌వోని ఫోన్ లో సంప్రదించగా తాను అనుమతివ్వలేదని తెలిపాడు. దీంతో పోడు దున్నుతున్న ట్రాక్టర్ ని శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి రేంజర్ కి మధ్య కాస్సేపు వాగ్వివాదం జరిగింది. పనులకు అటవీ అధికారులు ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయారు.