హైదరాబాద్: కొత్త సంవత్సరంలో తెలంగాణ రాజకీయాలు మారుబోతున్నాయా? టీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాటలు నిజమైతే అది ఖాయమని చెప్పవచ్చు. వచ్చే ఏడాది మార్చిలోగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. మార్చి లోగా కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని రెడ్యా నాయక్ అన్నారు. 

డోర్నకల్ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులతో రెండు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఆ ట్రాక్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెడ్యా నాయక్ మాట్లాడారు. ఇటీవల తాను కేటీఆర్ ను కలిశానని ఆయన చెప్పారు. కురవి మండలంలోని సీరోవి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులు పేటలో హిహెచ్సీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. డోర్నకల్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు. 

ఆ విషయాలు చెబుతూ కేటీఆర్ సీఎం కావడం ఖాయమని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలు వెళ్లారని, ఆయన స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెడ్యా నాయక్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి అనూహ్య ఫలితాల సాధన వంటి అంశాల వల్ల కేటీఆర్ కు పట్టాభిషేకం చేయడాన్ని కేసీఆర్ వాయిదా వేస్తారని భావించారు. అయితే, కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.