టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం ఆ వ్యాఖ్యలు చేశారు.
వరంగల్: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్టేషన్ ఘనపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే టి. రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా తన అనుమతి తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గానికి నేనే తండ్రిని, నేనే మంత్రి అని చెప్పుకునేవాళ్లు తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయవద్దని రాజయ్య అన్నారు.
కాగా, టిఆర్ఎస్ పార్టీది, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ది పోరాటాల, త్యాగాల చరిత్ర అని, వెన్నుదన్నుగా నిలిచి, పార్టీ పోరాటాల్లో సైనికుల్లా పార్టీ శ్రేణులు, అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా పని చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వార్షికోత్సవాన్నిపుస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పర్యటించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, జనగామ జిల్లా పాలకుర్తి, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ తదితర ప్రాంతాల్లో కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ, నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి, అమర వీరులకు, ఆచార్య జయశంకర్ కు నివాళులర్పించిన మంత్రి ఆయా చోట్ల పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు.
ఎన్నో త్యాగాలు, మరెన్నో అవమానాలను భరిస్తూ కెసిఆర్ ఎన్నో విజయాలను ముద్దాడారన్నారు. తెలంగాణ కోసం నాడు తెలంగాణ వచ్చుడో...కెసిఆర్ చచ్చుడో... అంటూ నిరాహార దీక్ష చేసి, తెలంగాణ కోసం కెసిఆర్, తన ప్రాణాలను ఫణంగా పెట్టారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ తేగలమని చెప్పి, తెచ్చి నిరూపించిన మహా నేత కెసిఆర్ అని ఎర్రబెల్లి చెప్పారు. ఆ రోజుల్లో కెసిఆర్ అంటే ప్రభుత్వంలోని, ఇతర పార్టీలకు వెన్నులో వణుకు ఉండేదని, ఆ భయంతోనే దేవాదుల ప్రాజెక్టుకు పునాదులు పడి, ఆ ప్రాజెక్టు నేడు నీటిని అందిస్తున్నదని గుర్తు చేశారు. సాగునీటి కోసం ఇక్కడ కెసిఆర్ దీక్షకు పూనుకుంటాండు అంటే చాలు.. వెంటనే అక్కడకు వెళ్ళి శంకుస్థాపనులు చేసేవాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పార్టీ యువ నేత కెటిఆర్ నేతృత్వంలో మరింతగా పటిష్టమవుతున్నదని తెలిపారు.
తెలంగాణ తెచ్చిన కెసిఆర్, సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నారని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతున్నదని, ఆ కారణంగా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల మేరకు వరి ధాన్యం దిగుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వచ్చిన తరుణంలో కెసిఆర్, రైతుల పంటలు మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రూ.30వేల కోట్లను కేటాయించారని వివరించారు. రైతులు సంయమనంతో ఉండాలని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
పాలకుర్తిలో పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పూజారులు, ఇమామ్ లు, పాస్టర్లకు కలిపి మొత్తం 944 మంది ఉండగా, వాళ్ళందరికీ ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అయితే, ఈ రోజు వారిలో కొద్ది మందికి మంత్రి నిత్యావసర సరుకులను అందచేశారు. మిగతా వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి సరుకులు పంపిణీ చేయాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి ట్రస్టు బాధ్యులను ఆదేశించారు.
కాగా, నెక్కొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పర్వతగిరిలో మహిళలకు మాస్కులు పంపిణీ చేశారు. హన్మకొండలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నెక్కొండలో పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులను మంత్రి సన్మానించారు.
పర్వతగిరిలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పాలకుర్తి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నెక్కొండలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు పాల్గొన్నారు.