Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ను వీడనని చెప్పా: బ్రదర్ అనిల్ తో భేటీపై తాటికొండ రాజయ్య వివరణ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో తాను సమావేశం కావడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివరణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ను వీడబోనని చెప్పినట్లు తెలిపారు.

TRS MLA Rajaiah clarifies on YS Sharmila husband brother Anil
Author
Hyderabad, First Published Aug 9, 2021, 12:17 PM IST

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో తన భేటీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టత ఇచ్చారు. తాను అనిల్ తో భేటీ అయినట్లు వార్తలు కావడమే కాకుండా అందుకు సంబంధించిన ఫొటోలు కూడా లీక్ కావడంతో రాజయ్య ఆ వివరణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ను వీడబోనని బ్రదర్ అనిల్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. 

తన ఎదుగుదల అంతా టీఆర్ఎస్ తోనే అని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత తనను చాలా మంది కలిశారని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. 

జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బ్రదర్ అనిల్ ను కలిసినట్లు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. వైఎస్సార్ మీద అభిమానం ఉన్న మాట నిజమేనని, కేసీఆర్ తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. తానంటే పడనివారు, దళిత వ్యతిరేకులు అలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరడంపై కూడా రాజయ్య స్పందించారు. తెలంగాణలో బిఎస్పీకి ఆదరణ లభించందని ఆయన అభిప్రాయపడ్డారు. బిఎస్పీ దళిత బంధు వంటి పథకాన్ని అమలు చేసిందా అని ప్రశ్నించారు.

ఇదిలావుంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమావేశమమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై రాజయ్య స్పష్టత ఇచ్చారు. ఆదివారంనాడు వారిద్దరి భేటీ జరిగినట్లు చెబుతున్నారు. వారిద్దరు హైదరాబాదులోని లోటస్ పాండులో కాకుండా వేరే ప్రాంతంలో సమావేశమైనట్లు చెబుతున్నారు. 

తాటికొండ రాజయ్య కొద్ది రోజులుగా బ్రదర్ అనిల్ తో తరుచుగా సమావేశమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి భేటీ గురించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు గుసగుసగా చెబుకుంటున్నాయి. ఈ భేటీ మతపరమైందా, రాజకీయపరమైందా అనే విషయంపై స్పష్టత లేదు. 

ఈ భేటీపై టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజయ్యపై టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే విషయం తెలియడం లేదు. కాగా, గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి తొలిగించారు. దాంతో ఆయన అప్పటి నుంచి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రెండోసారి రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ రాదని భావించారు. కానీ కేసీఆర్ ఆయననే పోటీకి దించారు. రెండోసారి గెలిచిన తర్వాత కూడా టీఆర్ఎస్ లో రాజయ్య స్థాయి మారలేదు. దానికితోడు వరంగల్ జిల్లాలోని సీనియర్ నేత కడియం శ్రీహరితో ఆయనకు ఏ మాత్రం పొసగడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios