నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 64 ఏళ్లు.  గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 

శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడడంతో తెల్లవారు జామున ఆయనను ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నోముల నర్సింహయ్య 1957 జనవరి 9వ తేదీన జన్మించారు. ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం. గతంలో ఆయన సీపీఎం తరఫున నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా కాలం ఆయన సిపీఎంలో పనచిేశారు. సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యుడిగా పనిచేశారు. సీపీఎం శాసనసభా పక్ష నేతగా కూడా పనిచేశారు. 

2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఆయన సీపీఎంకు రాజీనామా చేశారు. 2014లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో మాజీ మంత్రి జానారెడ్డిపై నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన జానా రెడ్డిమీదనే విజయం సాధించారు. నోముల నర్సింహయ్య వృత్తిరీత్యా న్యాయవాది.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఆయన మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

నర్సింహయ్య మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల వెంట నడిచారని, తెలంగాణ కోసం దశాబ్దాలుగా వెంట నడిచిన పార్టీని విడిచి ప్రజల ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ వెంట నడిచారని అన్నారు.

నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహామయ్య ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహయ్య మృతి ప‌ట్ల‌ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంతాపం వ్య‌క్తంచేశారు. న‌ల్గొండ జిల్లా ఒక మంచి నిస్వార్థ రాజ‌కీయ నాయకుడిని కోల్పోయింద‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల కోసమే త‌న జీవితాన్ని అంకితం చేసిన న‌ర్సింహ‌య్య లోటును ఎవ‌రు తీర్చ‌లేర‌న్నారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.