టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధికారులపై చిందులు తొక్కారు. స్వయంగా మంత్రి వారిస్తున్నా వినకుండా తనకు అధికార యంత్రాంగం సహకరించడం లేదంటూ విరుచుకుపడ్డారు.

వివరాల్లోకి వెళితే... శుక్రవారం వరంగల్ హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకంపై రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ భేటీలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే వున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వద్దంటూ వారిస్తున్నా ముత్తిరెడ్డి పట్టించుకోలేదు.

జనగామ జిల్లాలో కలెక్టర్‌తో కలిసి నీళ్ల కోసం ప్రణాళికలు వేస్తుంటే అధికారులు సహకరించడం లేదంటూ మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టు సీనియర్ ఇంజినీరు (ఎస్ఈ) కనీసం పరిశీలించకుండా సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఈ విషయంలో ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్యేల మధ్య గొడవలు అవుతున్నాయని.. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి ఆరోపించారు.

ఈ మీటింగ్‌లో ఎమ్మెల్యేకు నచ్చజెప్పడానికి అసలు విషయం చర్చించడానికి కూడా అధికారులకు సమయం ఇవ్వకుండా ఇలా చేయడంపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఉన్నతాధికారులు, అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముత్తిరెడ్డి ఇప్పటికే ఇలాంటి పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.