జనగామ కలెక్టర్ శ్రీదేవసేన పై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కలెక్టర్ శ్రీ దేవసేన రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ముత్తిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏం మాట్లాడారో వివరాలు చదవండి ఆయన మాటల్లోనే.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు కబ్జా నిజమే అంటూ ఓ పత్రిక లో వచ్చిన వార్త లో ఎలాంటి నిజం లేదు. చెరువు కబ్జా ను నిర్దారించడానికి ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదు. కమిటీ ముచ్చట అంతా ఉత్తదే. జనగామ చెరువు సుందరీకరణ కు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. ఆఖిల పక్షం కమీటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేస్తున్నాను. జనగామ చెరువు విస్తీర్ణం తగ్గలేదు.. ఆ మాటకొస్తే ఇంకా పెరిగింది కూడా. చెరువు లోకి వస్తున్న డ్రైనేజీ ని దారిమాళ్లించేందుకే పైప్ లైన్ వేశాము. మండలి లో రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ చెరువు విస్తీర్ణం పై స్పష్టమైన సమాచారమిచ్చారు. అయినా కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు.

కలెక్టర్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. చెరువు సుందరీకరణను మంత్రులు హరీష్ రావు ,కడియం శ్రీహరి మెచ్చుకున్నారు. అంతేకాకుండా పనులు తొందరగా పూర్తి కావాలని సీఎం గారు కూడా ఆదేశించారు. సిద్ధిపేట లో కోమటి చెరువు తరహా లో జనగామ చెరువు అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. నేను ఆ దిశగానే పనిచేస్తున్నాను. కలెక్టర్ శ్రీ దేవసేన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీ ఎస్ ఆమె మీద ఫిర్యాదు చేశాను కూడా. కలెక్టర్ కు అనుభవరాహిత్యం ఉన్నట్టు స్పష్టం గా అర్ధమవుతోంది.

చెరువు వల్ల జనగామ మునిగిపోదు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కలెక్టర్ ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. అంతేకాదు జనగామ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా కలెక్టర్ పని చేస్తున్నారు. చాలా మంది ఆధికారులను పని చేయకుండా కలెక్టర్ అడ్డుకుంటున్నారు. చెరువు విషయంలో నా తప్పు ఉంటే ఉంటె ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.

దేశం లో కుంభకోణాలు లేకుండా పాలన సాగుతున్నది తెలంగాణా లోనే. నిపుణుల కమిటీ చెరువు కబ్జా ను తేల్చిందని తప్పుడు సమాచారం ఇచ్చిన వారి గురించి ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలి. నేను కూడా ప్రభుత్వం లో భాగమని కలెక్టర్ గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాను.