టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ జన్మదినాన్ని నిరుద్యోగ దినం పాటించాలని పేర్కొన్నాడని.. రేవంత్ జన్మదినాన్ని నేరస్తుల దినంగా జరుపుకోవాలని అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. 

హైదరాబాద్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy)పై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మండిపడ్డారు. కేసీఆర్(KCR) బర్త్‌డేను నిరుద్యోగ దినంగా పాటించాలని ఈ సన్నాసి పిలుపు ఇచ్చాడని నిప్పులు గక్కారు. దసరా, రంజాన్, క్రిస్టమస్ లాగా కేసీఆర్ బర్త్ డేను తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పండగ గా ప్రకటించాలని ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానన్నారు. రేవంత్ రెడ్డి జోకర్ మాటలు మాట్లాడి.. బ్రోకర్ పనులు చేస్తాడని ఫైర్ అయ్యారు. నువ్వొక సైకోవు, శాడిస్టువు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.ఊసరవెల్లికి వంశోధ్దారకుడివి అని.. ఆయనను చూస్తే ఊసరవెల్లిలు కూడా సిగ్గుపడతాయని అన్నారు. టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీలు మార్చిన రేవంత్ ఊసరవెల్లి గురించి మాట్టాడటమేంటని అన్నారు. పిచ్చి కాంగ్రెస్‌కు ఓ పిచ్చి పీసీసీ ప్రెసిడెంట్‌వి అంటూ మండిపడ్డారు. గాంధీ భవన్‌ను బ్రాందీ భవన్ చేశావ్ అని, కనకంబు సింహాసనం ఎక్కిన శునకానివి నీవు అంటూ రేవంత్‌పై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సింహం అని, రేవంత్ ఒక శునకం అని అన్నారు. రేవంత్ బర్త్‌డేను నేరస్తుల దినంగా పాటిస్తాం అని పేర్కొన్నారు.

లాగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి పార్టీలు మార్చాడని ఆరోపించారు. మొదట బీజేపీలో, ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేశాడని అన్నారు. కానీ, ఆయన చిల్లరబుద్దులు పార్టీలో నడవలేదని, అందుకే టీడీపీ పంచన చేరాడని చెప్పారు. కానీ, ఆయన చేరికతో టీడీపీ దివాళా తీసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి గాంధీ భవన్ గాడ్సే అయ్యాడని విమర్శించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, కానిస్టేబుల్ చేతిలో ఉండే లాఠీ అంత కూడా లేని ఈ లూటీవాలాకు కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఉన్నదా? అని నిలదీశారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కడమే కానీ, ఎప్పుడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ కాలు పడగానే గాంధీ భవన్.. బ్రాందీ భవన్ అయిందని, ఆయన కాంగ్రెస్‌లో చేరినాక తిట్టుకోవడం, నెట్టుకోవడం, కొట్టుకోవడం తప్ప ఏమైనా జరిగిందా? అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ ఏ సమావేశం పెట్టినా కోమటిరెడ్డి మండిపాటు, జగ్గారెడ్డి ఫైర్, ఉత్తమ్, జానా డుమ్మా, ఇంకొందరు అలక, వీహెచ్ కంటతడి అంటూ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఎంత పెట్టి కొనుక్కున్నావని కార్యకర్తలు నిలదీసిన వార్తలే కదా అని ఎద్దేవా చేశారు. పట్టపగలే పట్టుబడ్డ గజ దొంగవు. దొంగలకు సద్దులు మోసే లంగవు, లఫంగవు అంటూ విరుచుకుపడ్డారు. బ్లాక్ మెయిలింగ్.. మనీ గెయినింగే కదా ఆయన వృత్తీ ప్రవృత్తీ అని ఆరోపించారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను సంస్కార హీనంగా తిడితే ఎవరినీ వదిలేది లేదని, వారిని జైలుకు పంపాల్సిందేనని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. లేకుంటే ఆగం అవుతారని హెచ్చరించారు. ఇలాగే నోరుపారేసుకుంటే.. ఉరికి వచ్చి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.