కరీంనగర్: ఓ యూట్యూబ్ ఛానెల్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తాను టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతానంటూ సదరు యూ ట్యూబ్ ఛానెల్ తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిందని న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 

ఇకపోతే గత వారం గంగుల కమలాకర్ టీఆర్ఎస్ పార్టీ వీడతారంటూ ఆ యూట్యూబ్ ఛానెల ప్రచారం చేసింది. బీజేపీలోకి వెళ్లే టీఆర్ఎస్ నేతల లిస్టు ఇదేంనటూ ఒక జాబితాను సైతం విడుదల చేసింది. ఆ ఛానెల్ ప్రసారం చేసిన స్టోరీ కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

తాజాగా ఆ వీడియోను చూసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ ఛానెల్ యాజమాన్యంపై రాష్ట్ర డీజీపీకి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు నిరాధారమైన కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ కథనాల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరులు సైతం కరీనంగర్ రూరల్, కొత్తపల్లి, కరీంనగర్ వన్ టౌన్, కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తమ నాయకుడుపై తప్పుడు ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కరీంనగర్‌ లో వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించడాన్ని చూసి ఓర్వలేని కొంతమంది సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.  

సీఎం కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆశయాల మేరకు పార్టీ పటిష్టత కోసం ఒక సైనికుడిగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. తుది శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆశయాల మేరకు వారి అడుగుజాడల్లో పనిచేస్తానని ఫేస్ బుక్ లో స్పష్టం చేశారు. 

తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తాయని, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నానని గంగుల హెచ్చరించారు. తనపై యూట్యూబ్ ఛానెల్ చేస్తున్న కథనాన్ని ప్రజలు నమ్మవద్దని గంగుల కమలాకర్ కోరారు.