తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరికి కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. 

తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిలిచారు. ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు కరోనా  బారిన పడినప్పటికీ తెలంగాణలో మాత్రం అలాంటి సంఘటనలు జరగలేదు. ఇక ఇటీవలే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కరోనా బారిన పడి విజయవంతంగా కోలుకున్నారు.

ఇకపోతే.... తెలంగాణలో కరోనా విలయతాండవం జరిగింది. శుక్రవారం కొత్తగా 164 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,035కి చేరింది. శుక్రవారం మరో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 174కి చేరుకుంది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,032 కాగా, 2,278 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 133 కేసులు నమోదవ్వగా... మేడ్చల్ 06, రంగారెడ్డి 6, సంగారెడ్డి 3, నిజామాబాద్ 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగుల్లో రెండేసి కేసుల చొప్పున సిద్ధిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

Also Read:బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చెందిన 10 మంది పోలీసులకు కరోనా

అటు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే  396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

భారత్ లో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 1,47,195 నయమై కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారిన పడి 8,498 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,97,535కు చేరింది.

Also Read:ఉస్మానియా మెడికల్ కాలేజీ ల్యాబ్‌ డేటా ఆపరేటర్‌కి కరోనా: వ్యాపారి మృతి

తమిళనాడులో 38,716 కరోనా కేసులుండగా… 349 మంది మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీలో 34,687మంది కోవిడ్ బారిన పడగా.. 1,085మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 22,067మందికి కరోనా బారిన పడగా… 1,385 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటడం ఇదే తొలిసారి.