కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఈ కరోనా వైరస్ బారిన పడుతున్న సంఘటనలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చెందిన 10 మంది పోలీసులు కరోనా వైరస్ బారినపడ్డారు. 

బంజారాహిల్స్ ఠాణా లో ఒక ఎస్సై, 8 మంది కానిస్టేబుళ్లు, ఒక హోమ్ గార్డ్ కి కరోనా సోకింది. వీరితోపాటుగా డీసీపీ వెస్ట్ జోన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్ కి కూడా కరోనా వైరస్ సోకింది. 

రెండు రోజులకింద ఈ పోలీస్ ఠాణాకి చెందిన ఒక కానిస్టేబుల్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలాడు. అతడికి పాజిటివ్ అని తేలడంతో ఇతర పోలీసులకు కూడా కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ విడతలవారీగా నిర్వహించిన పరీక్షల్లో వీరు పాజిటివ్ గా తేలారు. 

30 మంది ఇతర సిబ్బందికి కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. స్టేషన్ ని మొత్తం శానిటైజ్ చేసారు. కొందరు సిబ్బందిని హోమ్ క్వారంటైన్ లో ఉండమని అధికారులు సూచించారు. బుధవారం నాడు ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ అని తేలింది. అదేరోజు రాత్రికి మిగిలినవారి రిపోర్టులు కూడా రావడంతో ఆసంఖ్య 10కి చేరింది. 

అందరికి కూడా తీవ్రమైన లక్షణాలు లేవని, ప్రస్తుతానికి అందరూ ఆరోగ్యాంగానే ఉన్నట్టుగా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 84మంది పోలీస్ అధికారులకు కరోనా సోకింది. ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు విధులకు హాజరు కావద్దని...  ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

కరోనా పోరాటంలో ప్రంట్ లైన్ వారియర్స్  గా పోలీసులు ఎంతో సాహసోపేతంగా  విధులు నిర్వహించారు. యావత్ దేశం కరోనాకు భయపడి ఇళ్లకే పరిమితమైనా పోలీసులు మాత్రం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైనే  విధులు నిర్వహించారు. ఇలా ప్రజలను కరోనా నుండి  కాపాడే ప్రయత్నంలో కొందరు పోలీసులే దాని బారిన పడ్డారు.

పోలీసులు, వైద్యులతో పాటు కరోనా విజృంభణ సమయంలోనూ విధులు నిర్వహించారు జర్నలిస్ట్ లు. ఈ మహమ్మారికి సంబంధించిన వార్తలను సేకరించడానికి క్లిష్టమైన సమయాల్లోనూ వీరు విధులు నిర్వహించారు. దీంతో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 16మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకింది. వారు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.