Asianet News TeluguAsianet News Telugu

దర్శనం కోసం వచ్చి రాజకీయాలు అవసరమా... కేటీఆర్‌పై విమర్శలొద్దు : రఘునందన్‌పై చెన్నమనేని ఫైర్

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు‌పై మండిపడ్డారు వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్. మంత్రి కేటీఆర్ గురించి అనవసరంగా మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు. 

trs mla chennamaneni ramesh counter to raghunandan rao over his ramarks on minister ktr
Author
First Published Sep 18, 2022, 8:37 PM IST

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాజన్న దర్శనం కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రఘునందన్ రావు మాటలు వింటుంటే బాధగా వుందన్నారు. మంత్రి కేటీఆర్ చాలాసార్లు కుటుంబ సమేతంగా రాజన్నను దర్శనం చేసుకున్నారని .. కానీ నాస్తికుడు అనడం భావ్యం కాదని రమేశ్ వ్యాఖ్యానించారు. దేశంలో దేవుడిని ఎప్పుడూ దర్శనం చేసుకోవాలని, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది పౌరుల హక్కు అని చెన్నమనేని చురకలు వేశారు. 

గుడి చెరువులో 365 రోజులు నీళ్ళు ఉంటున్నాయని.. మీకు కనబడడం లేదా అని రమేశ్ ప్రశ్నించారు. బద్దీ పోచమ్మ ఆలయ విస్తరణ కోసం నిధులు వెచ్చించామని ఆయన గుర్తుచేశారు. మీ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి అయినా రాజన్న ఆలయానికి వెచ్చించారా అని చెన్నమనేని ప్రశ్నించారు.  ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం కాలం వెళ్లదీస్తోందని.. తెలంగాణాకి మీరు ఏం ఇచ్చారని రమేశ్ నిలదీశారు. ప్రజల మనసుల్లో విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారని... తెలంగాణ సాయుధ రైతు పోరాటం గొప్పగా జరిగిందని ఆయన గుర్తుచేశారు. 

ALso Read:చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హుడు.. హైకోర్టుకు తేల్చిచెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం

ఉత్తరప్రదేశ్‌లో భూస్వామ్య కుటుంబాలను సపోర్ట్ చేస్తున్నారని రమేశ్ ఆరోపించారు. దేవాలయంలో రాజకీయాలు చేయడం మీకు ఉండచ్చు కానీ, మాకు అలాంటివి ఉండవని ఆయన స్పష్టం చేశారు. తన పౌరసత్వంపై మాట్లాడాడని, కోర్టు పరిధిలో ఉన్నందున్న తాను మాట్లాడలేనని చెన్నమనేని రమేశ్ తెలిపారు. వేములవాడకు ఉపఎన్నిక వస్తుందని అంటున్నారని, 4 సార్లు బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాను. మా బాబాయ్ విద్యా సాగర్ రావును 20 వేళ ఓట్లతో ఓడగొట్టానని, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ 400 ఓట్ల తో కౌన్సిలర్ గా ఓడిపోయాడని చెన్నమనేని గుర్తుచేశారు. 

మీరు ఓట్ల కోసం మాట్లాడటమంటే నవ్వు వస్తోందని.. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని రమేశ్ తెలిపారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో సిరిసిల్ల జిల్లా లాగా ఉన్నాయా అని రమేశ్ నిలదీశారు. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయానికి డా. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడంపై చెన్నమనేని హర్షం వ్యక్తం చేశారు.  మీరు మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మరోసారి మాట్లాడితే మా జిల్లా నుంచి నిరసన చూస్తారని రమేశ్ పేర్కొన్నారు. మీకు నిజాయితీ ఉంటే కేటీఆర్‌పై, నాపై మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకోవాలని చెన్నమనేని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios