వరంగల్: టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఏమైందో గానీ తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావుపైనే విమర్శలు చేశారు. ఆయన నోరు జారారు. ఈ సంఘటన నడికూడ మండలం కంఠాత్మకూరులో గురువారం జరిగింది. 

కంఠాత్మకూరులో ఆయన రైతు వేదికను గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ మీద విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి 130 రోజులుగా కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద యెత్తున ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. 

రైతులు పెద్దయెత్తున ఆందోళన చేస్తున్నా పట్టించుకోని పుణ్మాత్ములు మన నరేంద్ర మోడీ, కేసీఆర్ అని ఆయన అన్నారు. అసలు తాను అడుగుతున్నానని, ఈ రోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే వ్యతిరేక చట్టాలు తీసుకుని వచ్చి రైతులు బోరున ఏడుస్తూ రోడ్డు మీద పడితే వాళ్లను పిలిచి మాట్లాడకుండా దేశానికి ఏదో చేసినట్లు, ఇంకా ఏదో చేస్తున్నట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. 

ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణపైనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.