మంచిర్యాల:  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి అద్భత ఫలితాన్ని రాబట్టినప్పటి నుండి  రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ విజయాలను అందుకోవడంతో చప్పగా సాగిన రాజకీయాలు బిజెపి రాకతో వేడెక్కాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇలా తాజాగా బిజెపి పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... మహారాష్ట్రలో శివసేన మాదిరిగా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. 

read more  మరో మూడేళ్లు కేసీఆరే సీఎం... కేటీఆర్ కు నో ఛాన్స్: బండి సంజయ్ సంచలనం

''బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ గుడులు, బడులు, ఇండియా, పాకిస్తాన్‌ పేరుతో రాష్ట్రంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. సంచలనాల కోసం మరోసారి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతాం'' అని హెచ్చరించారు. 

''కేసీఆర్‌ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వల్లనే బండికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన విషయాన్ని సంజయ్ గుర్తుంచుకోవాలి. ఎన్నికల కోసమే బీజేపీ, బండి సంజయ్‌ తొండి చేస్తున్నారు'' అని సుమన్ ఆరోపించారు.