వరంగల్: మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని... తనయుడు కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన ఆయనకు లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం గడీల పాలన సాగుతోందని... ప్రభుత్వ అవినీతి, అక్రమ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే వున్నాయని బండి సంజయ్ అన్నారు. 

వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ(మంగళవారం) సంజయ్ జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిజెపికి తెలంగాణ ప్రజల నుండి ఆదరణ లభిస్తోందన్నారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగిందన్నారు. టీఆర్ఎస్ ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీయే అని సంజయ్ స్పష్టం చేశారు.

read more  నాగార్జునసాగర్ బైపోల్: తెరపైకి లోకల్ నినాదం, నోముల కుటుంబానికి ఎర్త్

తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర నిధుల్లో భారీగా కమీషన్లు తీసుకుని వాటిని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని... ఆ ప్రయత్నాలను ఇటీవల ప్రజలు తిప్పికొడుతున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన దుబ్బాక , హైదరాబాద్  ఎన్నికలని సంజయ్ పేర్కొన్నారు.