తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమంలో నువ్వు వున్నావా అంటూ ప్రశ్నించారు.

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లు సంజయ్ మాట్లాడుతున్నాడని సుమన్ ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లపై మాట్లాడే అర్హత సంజయ్‌కి లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది తాము అని సుమన్ స్పష్టం చేశారు.

బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని.. 2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు మీరు సిద్ధపడితే ఆంధ్రా ప్రజలు మీపై తిరగబడుతున్నారని సుమన్ మండిపడ్డారు.

దేశంలోని మొత్తం సంపదను రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఫైల్ ఢిల్లీలో పెండింగ్‌లో ఉందని దానిని క్లియర్ చేయించాలని బీజేపీ నేతలకు సుమన్ సవాల్ విసిరారు.

తెలంగాణలో లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నారంటూ సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీ దేశంలోని అన్ని సంస్థలకు టులెట్ బోర్డ్ తగిలించిందన్నారు.