Asianet News TeluguAsianet News Telugu

అవిశ్వాసంపై కేసిఆర్: చంద్రబాబు నేర్పిన విద్యయే...

రాష్ట్రానికి మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలని చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు కేసిఆర్ తన ఎంపీల ద్వారా అదే మాట చెప్పిస్తున్నారు. 

TRS may act against No trust Motion

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోంది. దాని వాదన కూడా అదే విధంగా ఉంది. టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోవడానికి తగిన వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరిస్తున్నట్లు వినోద్ కుమార్ మాటల ద్వారా అర్థమవుతోంది. 

కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశంలో గతంలో చెప్పినట్లే టీడీపీకి అండగా నిలుస్తామని అన్నారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనిదానిని కోరడమేంటని ప్రశ్నించారు. 

ఈ రకమైన వాదనను ముందుకు తెస్తూ అవిశ్వాసంపై ఓటింగుకు దూరంగా ఉండడం లేదా అవసరమైతే అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయడం అనే వ్యూహాన్ని ఎంచుకోవాలని కేసిఆర్ ఎంపీలకు మార్గనిర్దేశం చేసినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ తో పాటు శివసేన, బిజెడి తటస్థంగా ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలున్నాయి.
 
ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్‌ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని వినోద్ కుమార్ అన్నారు. 2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. 

కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇలాగే స్పందించారని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, నాలుగేళ్లపాటు టీడీపీ బీజేపీ జట్టు కట్టినప్పుడు తాము దాని గురించి అడగలేదని గుర్తు చేశారు. అవిశ్వాసంపై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. అవిశ్వాసం అంశం ఓటింగ్‌కు వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవాలంటే కేంద్ర మంత్రులు సహకరించాలని, అలాంటి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం అంటే రాష్ట్రానికే నష్టమని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అయితే, ఎన్డీఎ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదే పదే డిమాండ్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వాదననే టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు వినిపించారు. టీఆర్ఎస్ ఎంపీల మాటలు కేసీఆర్ వైఖరిని తెలియజేస్తున్నాయి. 

రాష్ట్రానికి మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలని చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు కేసిఆర్ తన ఎంపీల ద్వారా అదే మాట చెప్పిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios