Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీటీవీ ఓపీనియన్ పోల్స్: టీఆర్ఎస్‌‌ది తిరుగులేని హవా, కాంగ్రెస్ దిగదుడుపే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ 85 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుందని  ఎన్డీటీవీ ఓపినియన్ పోల్స్‌ తేల్చి చెప్పింది. 

TRS likely to win 85 seats in telangana :NDTV opinion polls
Author
Hyderabad, First Published Oct 10, 2018, 12:36 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ 85 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుందని  ఎన్డీటీవీ ఓపినియన్ పోల్స్‌ తేల్చి చెప్పింది. ఈ సర్వే రిపోర్ట్‌ను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని 119 అసెంబ్లీ  స్థానాలు ఉన్నాయి. కనీస మెజారిటీ 60 అసెంబ్లీ స్థానాలు.  2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌కు 63 స్థానాలు  దక్కాయి. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీల నుండి  టీఆర్ఎస్‌లో  ఎమ్మెల్యేలు చేరడంతో  విపక్షాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీటీవి ఓపినియన్ పోల్ సర్వే ఆధారంగా  టీఆర్ఎస్‌కు 85 స్థానాలు  దక్కనున్నాయి.

గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు  కేవలం 63 స్థానాలే దక్కాయి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అదనంగా 22 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

 

 

 కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 21 సీట్లను కైవసం చేసుకొంది. అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 స్థానాలు మాత్రమే దక్కనున్నట్టు  ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతోంది.ఎంఐఎంకు 7 స్థానాలు,  బీజేపీకి 5 స్థానాలు దక్కనున్నాయని ఈ రిపోర్ట్ చెబుతోంది.  ఇతరులకు 4 స్థానాలు దక్కనున్నట్టు వెల్లడించింది. అయితే గత ఎన్నికల సమయంలో  టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో  టీడీపీకి 15 అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ స్థానం దక్కింది. బీజేపీకి 5 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానం దక్కింది.

గత ఎన్నికల తర్వాత తెలంగాణలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  టీడీపీ రాష్ట్రంలో  బలహీనపడింది.  టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.  ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఇద్దరు మాత్రమే  టీడీపీలో ఉన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవచ్చని ఈ సర్వే రిపోర్ట్ తేల్చి చెబుతోంది. ఈ దఫా టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

ఈ నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడడంలో  టీడీపీ కీలకంగా వ్యవహరించింది. అయితే  మహాకూటమిపై కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మహాకూటమి ఏర్పాటులో  టీడీపీ కీలకపాత్ర పోషిస్తున్నందున  ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.  చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని  తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని మహాకూటమి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios