దానం సీటుపై చిక్కుముడి: బెంగళూరు చిత్తగించిన బొంతు రామ్మోహన్

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 8, Sep 2018, 10:38 AM IST
TRS leadership in a bid to pacify disgrunted leaders
Highlights

అభ్యర్థుల తొలి జాబితా విడుదలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసమ్మతి రాజుకుంది. ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ ఖైరతాబాద్ సీటు కావాలని అడుగుతుండగా, తమ కూతురు విజయలక్ష్మికి ఆ సీటు కేటాయిచాలని రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు అడుగుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌: అభ్యర్థుల తొలి జాబితా విడుదలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసమ్మతి రాజుకుంది. ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ ఖైరతాబాద్ సీటు కావాలని అడుగుతుండగా, తమ కూతురు విజయలక్ష్మికి ఆ సీటు కేటాయిచాలని రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు అడుగుతున్నట్లు సమాచారం.

ఉప్పల్ సీటును ఆశించి భంగపడిన హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ మరో నాయకుడితో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన విషయంలో ఏం చేయాలనే విషయంపై టీఆర్ఎస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.

టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాబూమోహన్‌ను కేసీఆర్‌ శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు. ఎమ్మెల్సీ కానీ, ఇతర ముఖ్య పదవులు గానీ ఇస్తానని వారికి భరోసా ఇచ్చారు. 
పార్లమెంటు సభ్యుడదు కేకే నివాసంలో జరిగిన విందు సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్‌ నుంచి తన కూతురు విజయలక్ష్మి లేదా తనయుడు విప్లవ్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వాలని కేశవరావు కోరుతున్నట్లు సమాచారం. ఆ సీటు కోసం దానం నాగేందర్‌ పోటీ పడుతున్న విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, అభ్యర్థులు ప్రకటించని సిట్టింగ్‌ స్థానాలు వరంగల్‌ తూర్పు, చొప్పదండి, మల్కాజిగిరిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వరంగల్‌ తూర్పు శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. 


మల్కాజిగిరి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ మల్లారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. మేడ్చల్‌, వికారాబాద్‌ స్థానాలను వలస నేతలతో భర్తీ చేస్తారని అంటున్నారు.
 
ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డికి నచ్చచెప్పి ఆయన స్థానంలో రామ్మోహన్‌కు అవకాశం కల్పించే అంశాన్ని టీఆర్ఎస్ నాయకులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ కు ఆ విషయాన్ని చెప్పి ఆయన ఆమోదిస్తే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

ఉప్పల్‌ అభ్యర్థిని మార్చేందుకు సీఎం అంగీకరిస్తే మేయర్‌గా కేశవ రావు కూతురు విజయలక్ష్మికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దానివల్ల దానం నాగేందర్ కు ఖైరతాబాద్ సీటు కేటాయించడం సులభమవుతుందని అంటున్నారు. 

ఇదిలావుంటే, ఖైరతాబాద్‌ టికెట్‌ కోరిన దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

loader