నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఈ హత్య వెనుక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని ఆరోపణలు చేశారు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్థానిక డిఎస్పీ సుధాకర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. పార్టీ మారాలంటూ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ను వేధించినట్లు ఆరోపించారు. పార్టీ మారకపోతే చంపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏమీ చేయలేక తన తమ్ముడి లాంటి వాడిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తుంగతూర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు యదాతదంగా ఇస్తున్నాం. రాష్ట్రం లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని టిఆర్ఎస్ కు ఆపాదించడం కాంగ్రెస్ కు అలవాటు గా మారింది. కాంగ్రెస్ నీచ ,దివాళాకోరు రాజకీయాల కు పాల్పడుతోంది.

నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. శ్రీనివాస్ హత్యకు జిల్లా మంత్రి ,ఎమ్మెల్యే వీరేశం ,చివరకు సీఎం కెసిఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు కోరడం వారి పిచ్చితనానికి నిదర్శనం. శ్రీనివాస్ హత్య పై న్యాయ విచారణ జరగాలని టిఆర్ఎస్ ఎల్పీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

శ్రీనివాస్ గత సంవత్సర కాలంగా ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే వీరేశం ఫోన్ కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫోన్ కాల్స్ లిస్ట్ కూడా బయట పెట్టమనాలి. మా ఎమ్మెల్యే వీరేశం ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టేందుకు అభ్యంతరం లేదు. శ్రీనివాస్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అనంగు శిష్యుడు. శ్రీనివాస్ హత్య కేసులో నిందితులు అంతా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్నవారే. ఫోటో లే విచారణకు ప్రామాణికమైతే నిందితులందరూ కోమటి రెడ్డితో ఫోటోలు దిగారు (ఫోటోలు ప్రెస్ మీట్ లో విడుదల చేసిన కర్నె) ఎమ్మెల్యే వీరేశం తో నిందితులు దిగిన ఫోటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినపుడు కాలేజ్ వద్ద దిగింది. యువ శాసన సభ్యుడు కాబట్టి వీరేశం తో ఫోటోలు దిగేందుకు ఉత్సుకత ఉంటుంది. 

నింధితుడు రాంబాబు ను కోమటి రెడ్డి పాముకు పాలు పోసి పెంచినట్లు పెంచారు. రాంబాబు పై చాలా కేసులు ఉన్నాయి. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏ విచారణ సంస్థ తో విచారణ జరిపినా మాకు అభ్యంతరం లేదు. హత్యా రాజకీయాలు మొదట్నుంచి కాంగ్రెస్ కు అలవాటే. టీఆర్ఎస్ పార్టీ హత్యా  రాజకీయాల కు వ్యతిరేకం.