సీఎం కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనలు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 9 నెలల్లోనే 2 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా నిర్మిస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలలుపట్టుకుంటున్నారు.
కేసీఆర్ మటల మరాఠీ అని అందరికీ తెలిసిందే. ఉద్యమ సయంలో ఆయన మాటలే తూటాలుగా పనిచేశాయి. ప్రత్యేక ఉద్యమానికి తెలంగాణ వాదులు కదిలేలా చేశాయి. ఆ మాటలే పెట్టుబడిగా ఎన్నికల వేళ బోలెడు హామీలను కేసీఆర్ ఇచ్చారు. అందులో అత్యంత ముఖ్యమైనది, దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు ఈ పథకం తమకు సాధనంగా ఉపయోగపడుతోందని సీఎం కేసీఆర్ తో సహా గులాబీ నేతలందరూ ఇన్నాళ్లు చాలా ధీమాగా ఉన్నారు.
హైదరాబాద్ తో సహా కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లిలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా భారీ స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందజేశారు. దీంతో సొంత నివాసం లేని ప్రజలు ఈ పథకంపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. కలెక్టర్ నుంచి చోటా మోటా గులాబీ నేతల వరకు అందరికీ ఈ పథకానికి తమను ఎంపిక చేయాలని ప్రజలు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంది. నియోజవర్గానికి కొన్ని ఇళ్లను మొదటి దశలో నిర్మించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే ఇచ్చేసింది.
అయితే ఈ పథకం పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ పథకంపై సర్కారును ఇరుకనపెట్టేలా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ పథకం అమలుపై స్పందించాల్సి వచ్చింది.
ఆయన ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ... రానున్న 9 నెల్లలో 2 లక్షల ఇళ్లు కట్టితీరుతామని అప్పుడే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని శపథం చేశారు.ఈ శపథం ఇప్పుడు ఎమ్మెల్యే పీఠానికే ఎసరెచ్చొలా తయారైంది.
లబ్దిదారుల ఎంపిక నుంచి టెండర్లు పిలవడం వరకు ఏ నియోజకవర్గంలోనూ ఒక్క పని ముందుకు కదలడం లేదు. ముఖ్యంగా టెండర్లు పిలిచినా కొన్ని చోట్ల కాంట్రాక్టరు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఈ పథకానికి సంబంధించి తమకు ఏమీ మిగలదని కాంట్రాక్టరు భావిస్తుండటం, మరో వైపు చాలా నియోజకవర్గాల్లో ఇసుక కొరత ఉంటడం తో కాంట్రాక్టర్లు సైడ్ అయిపోతున్నారు.
ఒక్క కరీంనగర్ జిల్లా నే తీసుకుంటే ఇక్కడ సిరిసిల్ల, సీఎం దత్తత తీసుకున్న చినముల్కనూరులో మాత్రమే ఇళ్ల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. మిగిలిన చోట్ల కనీసం లబ్ధిదారుల ఎంపిక కూడా జరగడం లేదు.
ఇలాంటప్పుడు 9 నెలల్లోనే 2 లక్షల ఇళ్లు ఎలా నిర్మిస్తాం అనే ప్రశ్న గులాబీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. అందుకే వచ్చే ఎన్నికల లోపు ఇళ్లు నిర్మించలేము. ఓట్లు అడగలేము అని తలలు పట్టుకుంటున్నారు.
