నిజామాబాద్:  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌కు నిజామాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  డీఎస్‌కు  వ్యతిరేకంగా  లేఖ రాశారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు  పాల్పడుతున్నాడని ఆ లేఖను సీఎంకు పంపారు. 

పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు డీఎస్ పాల్పడుతున్నాడని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా  డీఎస్ ఢిల్లీలో మకాం వేయడంపై  కూడ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

డీఎస్  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.దీంతో  డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన  నేతలు  సీఎం కేసీఆర్‌కు పంపిన లేఖను యధావిధిగా అందిస్తున్నాం.

 

                                                                               తేది.27.06.2018


 గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు- గారికి

నమస్సులు

నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేయస్సు కోరి మీతో ముఖ్యమైన విషయాన్ని మనవి చేయదలుచుకొన్నాం. రాజ్యసభ సభ్యుడైన డి.శ్రీనివాస్ గారు ద్రోహచింతనతో చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను మీ దృష్టికి తెస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం, స్థిరమైన పరిపాలనను అందించడం కోసం మీరు అహరహరం పరిశ్రమిస్తున్నారు.ఇందుకోసం కలిసివచ్చిన నాయకులందరికి ఉదార హృదయంతో పార్టీలో స్థానం కల్పించారు.

అదే క్రమంలో డి.శ్రీనివాస్ గారిని మన పార్టీలో చేర్చుకొన్నారు.ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడ ఇవ్వడానికి నిరాకరించింది.అందువల్ల ఘోరమైన అవమానబాధతో అలమటిస్తూ డి. శ్రీనివాస్ గారు తనను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవాలని మిమ్ముల్ని వేడుకొన్నారు.దాదాపు ఆరు నెలలపాటు అభ్యర్ధించడంతో మీరు దయతలచి పార్టీలో చేర్చుకొన్నారు.

ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించారు.సీనియర్ నాయకుడిగా ఆయనకున్న అనుభవం రీత్యా జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగపడతారని భావించారు.తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు ప్రాతినిథ్యం పొందే అవకాశం ఉంటే అందులో ఒకటి డి.శ్రీనివాస్ గారికి కేటాయించి ఎంపీని చేశారు.

మీరు విశాలదృష్టితో అత్యున్నత స్థానం కల్పించినా.. ఆయన మాత్రం వెనకటి గుణమేల మాను వినరా సుమతీ అన్న విధంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొదటి నుండి గ్రూపులు కట్టడం, పైరవీలు చేయడం, అక్రమార్జనకు పాల్పడటానికి పూర్తిగా అలవాటు పడిన  డి. శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నారు.

అవినీతికి ఆస్కారం లేని మీ పరిపాలనలో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరతీశారు.మెల్లమెల్లగా తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ.. పార్టీ ద్రోహనికి పాల్పడుతున్నారు.టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నిజామాబాద్  జిల్లా పార్టీకి పెట్టని కోటగా నిలిచింది. 2001లోనే జిల్లా పరిషత్ స్థానాన్ని అందించి తెలంగాణ బావుటాను ఎగురవేసింది.

తెలంగాణ ఉద్యమ చైతన్యంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ప్రతి సందర్భంలో బలపర్చారు.. జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది శాసనసభ స్థానాలను. రెండు పార్లమెంట్ స్థానాలను, మేయర్, జడ్పీ ఛైర్మెన్ స్థానాలనుయ కైవసం చేసుకొని బలీయంగా ఉన్న సందర్భంలో .. పార్టీకి ఏ మాత్రం అవసరం లేకున్నా డి.శ్రీనివాస్ గారికి పార్టీలో చోటు కల్పించారు.

ఎంతో  చైతన్యం కలిగిన , పార్టీ పవిత్రంగా భావించే నిజామాబాద్ జిల్లాలో డి. శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీ స్వభావానికి విరుద్దంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. తాను ఒక పక్క టీఆర్ఎస్‌లో కొనసాగుతూ..మరోక పక్క తన కొడుకును బీజేపీలో ప్రవేశపెట్టారు.అంతేకాకుండా తన కొడుకు ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. 

నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు.తన కొడుకు రాజకీయ ఎదుగుదల కోసం ఆశీర్వదించాలని కోరుతూ బీజేపీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారు.తన కొడుకు జిల్లాలోని టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలను తీవ్ర పదజాలంతో దూషిస్తోంటే ఖండించకపోగా  ఆయనకు వత్తాసుగా నిలుస్తున్నారు.

అవకాశవాదానికి పరాకాష్టగా ఇటీవలి కాలంలో  తాను టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మతనాలు ప్రారంభించారు.గతంలో టీఆర్ఎస్ చేతిలో రెండు సార్లు ఓటమి పాలైన డి. శ్రీనివాస్ గారు మొత్తంగా మూడుసార్లు నిజామాబాద్ ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన నాయకుడు.ఆయన వల్ల టీఆర్ఎస్ కు ఏనాడూ కూడ ఇసుమంతైనా ప్రయోజనం కలగలేదు.

మీరిచ్చిన గౌరవాన్ని నిలుపుకోకపోగా ద్రోహానికి పాల్పడుతున్న డి.శ్రీనివాస్ గారి విషయంలో మీరు ఇంకా వేచి చూసే ధోరణిని ప్రదర్శించకుండా సత్వరమే స్పందించి ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
                                                            
                                                                                             ఇట్లు

                                                                              పార్లమెంట్ సభ్యులు
                                                                             శాసనమండలి సభ్యులు
                                                                             శాసన సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్రసమితి
                                                                               నిజామాబాద్ జిల్లా.