జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, పోస్టర్లు చించేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికలు కమీషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రచారంలో బీజేపీ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడింది అంటూ గులాబీ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ.. తాము ఎన్నికల సంఘానికి రెండు ఫిర్యాదులు ఇచ్చామన్నారు.

బీజేపీ నాయకత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు పెట్టరాదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి..  తేజస్వీ సూర్య అక్కడ మీటింగ్ పెట్టారని భరత్ చెప్పారు.

ఇది చట్ట విరుద్ధమని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని ఆయన వెల్లడించారు. బీజేపీ నేతలు తాము ఇలానే రెచ్చగొడు అంటున్నారని..  శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు చేయాలని చూస్తున్నారని భరత్ ఎద్దేవా చేశారు.

నేషనల్ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై రాష్ట్రపతికి కూడా పిర్యాదు చేస్తామని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని భరత్ పేర్కొన్నారు.