హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్ దేశ, రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ కొన్ని కులాల ఆధిపత్యమే కొనసాగుతోందని ఆరోపించారు. ఆధిపత్యం చెలాయిస్తున్న కులాల్లోనూ కొంతమందే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారంటూ స్వామిగౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. 

నారాయణ గురు జయంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామిగౌడ్ నారాయణఫ గురుకు నివాళి అర్పించారు. అనంతరం ప్రస్తుత రాజకీయాల్లో బడుగు బలహీనవర్గాల అణచివేత గురించి మాట్లాడారు. దేశంలో కుల రక్కసి మరింత బలపడిందని, దీంతో ఆధిపత్య కులాలు బడుగు బలహీన వర్గాలను మరింత అణచివేస్తున్నాయన్నారు. 

read more  పోతిరెడ్డిపాడుపై కీలక చర్చ...జగన్ రాయలసీమ పర్యటన ఖరారు

''దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొన్ని కులాల ఆధిపత్యమే కొనసాగుతోంది. రాజకీయాలు, పరిపాలనను ఈ ఆధిపత్య కులాలే నడిపిస్తున్నాయి. వందల ఏళ్ళ క్రితం పడగలు విప్పిన ఈ కులాల పునాదులపైనే నేటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇలా బలహీన వర్గాలు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరం దాడికి గురవుతున్నాయి. దేశంలో మళ్లీ గుడి, బడి కొంతమందికే పరిమితి కావడం వల్లే  నారాయణ గురును మనం గుర్తుచేసుకుంటున్నాం'' అని అన్నారు.
 
''బడుగు బలహీన వర్గాల కోసం ఏకరూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన నారాయణ గురు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. ఆయన స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా వుంటూ రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. కులాల పేరిట కాకుండా ఎవరికయితే పరిపాలనా సామర్థ్యం వుంటుందో వారే అధికారాన్ని చేపట్టే రోజులు త్వరలోనే రానున్నాయి'' అని స్వామిగౌడ్ పేర్కొన్నారు.