Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడుపై కీలక చర్చ...జగన్ రాయలసీమ పర్యటన ఖరారు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పోటెత్తడంతో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. 

AP CM YS Jagan Rayalaseema Tour Confirmed
Author
Amaravathi, First Published Aug 20, 2020, 3:32 PM IST

అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పోటెత్తడంతో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండటంతో ఇప్పటికే మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం శ్రీశైలంలో పర్యటించనున్నారు. 

శుక్రవారం ఉదయం జగన్ మొట్టమొదటిసారి సీఎం హోదాలో శ్రీశైలం వెళ్లనున్నారు. మొదట నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకోనున్నారు. 

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అంతకంతకూ వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో కాసేపట్లో మరో 5 గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఇప్పటికీ ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకుని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశాలున్నాయి. 

శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై చర్చించేందుకు అధికారులతో చర్చించనున్నారు. ఈ సామర్థ్యం పెంపుకోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో దీనిపైనే ముఖ్యమంత్రి అధికారులతో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. 

read more  పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్

ఇప్పటికే తెలంగాణ ఎన్నీ అభ్యంతరాలు తెలిపినా రాయలసీమ ఎత్తిపోతల పథకం( పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్థ్యం పెంపు) పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకే సాగుతోంది. ఈ ప్రాజెక్టు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. ఈ విషయమై కృష్ణా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఈ విషయమై చర్చ జరగనుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.

అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేష్ స్కీమ్ చేపడితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు ఏడారిగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ మహబూబ్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios