హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నాయకులకు గాలం వేసిన బిజెపి  టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులపై కూడా కన్నేశారు. గతంలో శాసనమండలి ఛైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా వున్న స్వామిగౌడ్ ను బిజెపిలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ లు శనివారం స్వామిగౌడ్ ను కలిసి ఈ విషయంపై చర్చించారు. అయితే ఈ సమావేశం అనంతరం స్వామిగౌడ్ టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరడానికి ఒప్పుకున్నాడా... లేదా అన్న విషయం మాత్రం సస్పెన్స్ లో వుండిపోయింది. దీనిపై స్వయంగా స్వామిగౌడ్ క్లారిటీ ఇచ్చారు. 

తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయం ఏదయినా తీసుకుంటే తప్పకుండా ముందు మీడియాకే చెబుతానన్నారు. తనను కిషన్ రెడ్డి, సంజయ్ లు కలిసిన మాట నిజమేనని... ఇది కేవలం స్నేహపూర్వకమే అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులతో కలవకూడదని నిబంధనలేమీ లేవని స్వామిగౌడ్ అన్నారు.  

read more  స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్‌లో అన్యాయం: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఇదిలావుంటే, యాంకర్ కత్తి కార్తిక శనివారంనాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత జి. కిషన్ రెడ్డిని కలిశారు. ఆమె ఒకటి రెండు రోజుల్లో బిజెపిలో చేరే అవకాశం ఉంది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో కార్తిక పోటీ చేశారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు.

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కిషన్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కత్తి కార్తిక టీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు సన్నిహిత బంధువు. వరుసకు ఆమె పద్మారావుకు మనవరాలు అవుతారు. తనకు పద్మారావు ఆదర్శమని గతంలో ఆమె ఓ సందర్భంలో చెప్పారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఇతర పార్టీల నాయకులకు వల విసురుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రదానంగా కాంగ్రెసు నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 

కాంగ్రెసు నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరారు శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, నియోజకవర్గం ఇంచార్జీ రవి కుమార్ యాదవ్ కూడా బిజేపిలో చేరారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బిజెపిలో చేరే అవకాశం ఉంది.