Asianet News TeluguAsianet News Telugu

ఒంటిపై డీజిల్ పోసుకుని... ప్రగతిభవన్ ఎదుటే టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడొకరు హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. 

trs leader suicide attempt at pragathi bhavan
Author
Hyderabad, First Published Sep 14, 2021, 10:56 AM IST

హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. టీఆర్ఎస్ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చుచేశాడు. పార్టీ బలోపేతం కోసం తన వంతుగా చేయాల్సిందంతా చేశాడు. అయినా పార్టీలో సరయిన గుర్తింపు లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ఓ టీఆర్ఎస్ నాయకుడు హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యాయత్నాన్ని ప్రగతిభవన్ వద్ద సెక్యూరిటీ విధులు చేపట్టిన పోలీసులు అడ్డుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లాకు చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీకోసం పనిచేస్తున్న తనకు ఏదయినా పదవి ఇవ్వాలని ఎప్పటినుండో లక్ష్మణ్ టీఆర్ఎస్ అగ్రనేతలను వేడుకుంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కోసం సొంతడబ్బులు ఖర్చు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నానని... తన పరిస్థితిని గుర్తించి పార్టీ పదవిగానీ, ప్రభుత్వంలో ఏదయినా నామినేటెడ్ పదవి కానీ ఇవ్వాలని అతడు కోరుతున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

జనగామ నుండి హైదరాబాద్ కు చేరుకున్న లక్ష్మణ్ సీఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి యత్నించాడు. అయితే ప్రగతిభవన్ వద్ద విధుల్లో వున్న పోలీసులు అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనతో ప్రగతి భవన్ వద్ద కాస్సేపు గందరగోళం నెలకొంది. 

లక్ష్మణ్ ను ప్రగతిభవన్ వద్దనుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే అక్కడకూడా అతడు ఆందోళనకు దిగాడు. స్టేషన్లోనే కాస్సేపు నేలపై బైఠాయించాడు. అయితే పోలీసులు  కౌన్సెలింగ్ ఇవ్వడంతో శాంతించిన లక్ష్మణ్ అక్కడినుండి వెళ్లిపోయాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios