పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు అసమ్మతి సెగ తగులుతోంది. పాలకుర్తి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ స్థానం నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వరంగల్‌: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు అసమ్మతి సెగ తగులుతోంది. పాలకుర్తి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ స్థానం నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


గత రెండు పర్యాయాలుగా పాలకుర్తి ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచినప్పటికీ అన్యాయమే జరిగిందని అన్నారు. ఉద్యమకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని ఆయన విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానంపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పునరాలోచించాలని, స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. 

పాలకుర్తి ఉద్యమకారులు గడ్డ అని, భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.ఉద్యమకారులను కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని, కార్యకర్తల ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన దయాకర్‌ రావు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత పాలకుర్తిలో అభివృద్ది జరగలేదని, ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. 

తనకు ఇస్తానని చెప్పిన వరంగల్‌ ఎమ్మెల్సీ పదవి కొండ మురళికి ఇచ్చినా తాను బాధపడలేదని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయసేకరణతోనే తనకు టికెట్‌ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గతంలో మూడు సార్లు కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నానని తెలిపారు.