ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుటుంబం గురించి తాను చెప్పిన విషయాలు అబద్ధాలు అయితే రాజకీయం సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నానని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధు సవాల్ విసిరారు. అయినా శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు గురించి మంథని ప్రజలకు అంతా తెలుసిందేనంటూ విమర్శించారు. 

ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ అయ్యేనాటికి శ్రీపాదరావు ఆర్టీసీ బస్సుల్లో తిరిగింది, ఓడిపోయాక అంబాసిడర్ కారులో తిరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.అసలు తన తండ్రిని నక్సల్స్ ఎక్కడ కాల్చి చంపారో శ్రీధర్ బాబు బహిర్గతం చేయాలని పుట్ట మధు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో శ్రీపాదరావు ఎంత మంది మహిళలను చిత్ర హింసలకు గురిచేశాడో మంథని ప్రజలందరకీ తెలుసునని గుర్తుచేశారు.

read more   నువ్వెంతంటే నువ్వెంత.. వేదికపైనే జగదీశ్ రెడ్డి - ఉత్తమ్‌ల బాహాబాహీ (వీడియో)

అదే విధంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు హత్యకేసుల్లో నిందితుడని, అలాంటి వ్యక్తికి తనను విమర్శించే స్థాయి ఎక్కడిదని అన్నారు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీవ్ రహదారి రోడ్లు అస్తవ్యస్తంగా వేయించి శ్రీధర్ బాబు వద్ద ముడుపులు తీసుకున్నాడని ఆరోపించారు. కోడిపందాల జూదరికి తనను విమర్శించే స్థాయి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా విజయరమణా రావు బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని మధు డిమాండ్ చేశారు.

తాను శ్రీధర్ బాబును విమర్శిస్తే పెద్దపల్లిలో మీరెందుకు డప్పులు కొడుతున్నారని ప్రశ్నించారు. మరోసారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంథని ఎమ్మెల్యే ఇంటి ఎదుట దీక్ష చేస్తానని జెడ్పీ చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్, ఏఎంసీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.