ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితెల వారిపైకి దూసుకెళ్లారు. అక్కడున్న వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించగా.. తనను నలదీసిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై బూటు కాలితో దాడి చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ నాయకుడు వొడితెల సతీశ్‌ కుమార్‌ బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తమ నిరసన తెలియజేసేందుకు రోడ్డుపై బైఠాయించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా ఈ ధర్నాలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కూడా ఉండటంతో.. ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితెల వారిపైకి దూసుకెళ్లారు. అక్కడున్న వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఎమ్మెల్యేకు జతచేరి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై దాడికి దిగారు. 

దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాటతో సుమారు 20 నిమిషాల పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.