తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  తల్లీకూతుళ్లు అరుదైన ఘనత సాధించారు. కోమరం భీం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఆమె కుమార్తె కోవా అరుణ ఇద్దరు జడ్పీటీసీలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సక్కు చేతిలో కేవలం 176 ఓట్ల తేడాతో లక్ష్మీ ఓడిపోయారు. దీంతో ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మీ పేరును కేసీఆర్ ప్రకటించారు.

అనేక పరిణామాల మధ్య ఆమె జైనూర్ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె అరుణ సిర్పూర్ నుంచి 3,444 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో తల్లీకూతుళ్లు జడ్పీ సమావేశాల్లో కలిసి పాల్గొననున్నారు.

కాగా.. కోవా లక్ష్మీ కుట్రకు పాల్పడ్డారని జైనూర్ బీజేపీ అభ్యర్ధి మైసన్ శేకు అతని భార్య చంద్రకళ ఆరోపించారు. ‘‘ మా ఇద్దరినీ కిడ్నాప్ చేసి వేర్వేరు చోట్ల బంధించారని.. నామినేషన్ విత్ ‌డ్రా చేసుకోకపోతే తన భర్తను చంపుతామని బెదిరించినట్లుగా చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని శేకు, చంద్రకళ డిమాండ్ చేశారు.