టీఆర్ఎస్‌లో వుండేది లేనిది కాలం చేతుల్లోనే : జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో వుండాలా, వద్దా అనేది కాలమే నిర్ణయిస్తుందని.. ఆత్మగౌరవం కోసం సమ్మేళనాలు పెట్టుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేటలో తన అనుచరులతో కలిసి బుధవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ.. తనకు ఆత్మగౌరవ సమస్య ఏర్పడిందన్నారు. ఆత్మగౌరవం కోసం సమ్మేళనాలు, ప్రస్థానాలు చేయాల్సి వస్తోందని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ... సిట్టింగ్ సీఎం అయినా చెప్పేదొకటి చేసేదొకటి అయితే వాళ్లను ప్రశ్నిస్తానని, నిలదీస్తానని జూపల్లి స్పష్టం చేశారు. తాను ఏ రోజూ కూడా పదవుల కోసం పాకులాడనని కృష్ణారావు పేర్కొన్నారు. భవిష్యత్తును, టీఆర్ఎస్‌లో కొనసాగడాన్ని కాలమే నిర్ణయిస్తుందని జూపల్లి స్పష్టం చేశారు.
కాగా... గత కొద్దిరోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ టీఆర్ఎస్‌లో జూపల్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు.
ALso REad:కొందరు ఎస్సైలు నా వాళ్లని వేధిస్తున్నారు.. ఊరుకునేది లేదు, దసరా వరకు డెడ్‌లైన్ : జూపల్లి కృష్ణారావు
ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో జూపల్లిని కలిసిన మంత్రి కేటీఆర్ సర్దుకుపోవాలని సూచించినట్లుగా సమాచారం. అయినప్పటికీ కొల్లాపూర్‌లో ఎలాంటి మార్పూ రాలేదు.