యాదాద్రి భువనగిరి జిల్లాలో వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల చేపట్టిన మహాప్రస్థాన పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ నాయకుడొకరు మాంసం కత్తితో పాదయాత్రలో ప్రవేశించి వీరంగం సృష్టించాడు. 

భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) మహాప్రస్థాన పాదయాత్ర (mahaa prasthana padayatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా (yadadari bhuvanagiri)లో షర్మిల యాత్ర కొనసాగుతుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS party) నాయకుడొకరు వీరంగం సృష్టించాడు. మాంసం కత్తితో వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తల బెదిరించడమే కాదు ఓ కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట వైఎస్సార్ టిపి పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు, కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా మహాప్రస్థాన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటివిడత పాదయాత్ర ముగియగా ఇటీవలే రెండో విడత పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. 

నిన్న(శనివారం) షర్మిల పాదయాత్ర బిబినగర్ మండలంలో మొదలై భువనగిరి మండలానికి చేరింది. మధ్యాహ్నానికి ఈ పాదయాత్ర బొల్లెపల్లికి చేరుకుంది. గ్రామ శివారులోని చెన్నోలబావి వద్ద షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసారు. సాయంత్రం కూడా అక్కడే ''షర్మిలక్కతో మా ముచ్చట'' కార్యక్రమం వుండటంతో పార్టీ కార్యకర్తలు అందుకోసం ఏర్పాటు చేస్తుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు వీరంగం సృష్టించాడు.

అధికార పార్టీ వార్డ్ మెంబర్ అయిన తాళ్లపల్లి శ్రవణ్ మాంసం కత్తితో వైఎస్పార్ టిపి పాదయాత్ర బృందలోకి ప్రవేశించాడు. కార్యకర్తలను తరలించడానికి ఉపయోగిస్తున్న ఓ వాహనం టైర్ ను కోసుసాడు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ కార్యకర్తపైకి దాడికి వెళ్ళాడు. కత్తితో తమపైకి వచ్చిన అధికార పార్టీ నాయకున్ని చూసి వైఎస్సార్ టిపి శ్రేణులు భయపడిపోయాయి. 

ఈ క్రమంలో గ్రామంలోని పిహెచ్సి వద్ద ప్లెక్సీ కడుతున్న వైఎస్సార్ టిపి కార్యకర్త శివరాజ్ శ్రవణ్ కంటపడ్డాడు. దీంతో ప్లెక్సీ కట్టడానికి ఉపయోగిస్తున్న తాడును శ్రవణ్ గట్టిగా లాగడంతో అదికాస్తా శివరాజ్ మెడకు చుట్టుకుని ఉరిలా బిగుసుకుపోయింది. బాధితుడు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కాపాడి హాస్పిటల్ కు తరలించారు. 

ఇలా టీఆర్ఎస్ నాయకుడు తమ పాదయాత్ర బృందంలోకి మారణాయుధంతో చొరబడి ఓ కార్యకర్తను గాయపర్చినట్లు తెలుసుకున్న వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. వెంటనే దుండుగుడు శ్రవణ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ఆందోళనకు దిగారు. బొల్లేపల్లి-బిబినగర్ రహదారిపై కూర్చుని ఆమె రాస్తారోకో చేయడంతో కాస్సేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు శ్రవణ్ పై కేసు నమోదు చేసినట్లు తెలపడంతో షర్మిల ఆందోళనను విరమించారు. 

ఈ ఘటనపై షర్మిల మాట్లాడుతూ... అధికార అండతో టీఆర్ఎస్ నేత శ్రవణ్ తమ పార్టీ కార్యకర్తపై దాడిచేసినట్లు షర్మిల పేర్కొన్నారు. శివరాజ్ మెడకు తాడు ఉరిలాగా బిగుసుకోగా అక్కడున్నవారు వెంటనే స్పందించడంతో అతడి ప్రాణాలు దక్కాయని... కొంచెం లేటయినా ఘోరం జరిగేదని పేర్కొన్నారు. ఇలా టీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు తెగబడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. 

శ్రవణ్ స్థానికంగా ఎన్ని అరాచకాలు చేస్తున్నా అధికార పార్టీ నాయకుడు కాబట్టే పోలీసులు కూడా ఇంతకాలం ఒక్కకేసూ నమోదుచేయలేదని స్థానికులు చెబుతున్నారని షర్మిల అన్నారు. ఇలాంటి నాయకులతో బీభత్సం సృష్టించి తన పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ పెద్దలు, ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల అన్నారు.