తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ లీడర్లు బూతు పంచాంగం ఎత్తుకుంటున్నారు. అయినదానికి కానిదానికి తిట్లనే నమ్ముకుంటున్నారు. ప్రత్యర్థులను తిట్టి తిట్టి అలవాటు పడ్డారు కాబట్టి పక్కోళ్లు దొరకకపోతే సొంత పార్టీ వాళ్లను కూడా వదలకుండా తిడుతున్నారు. యాదాద్రి జిల్లాలో ఒక టీఆర్ఎస్ లీడర్ సొంత పార్టీ నాయకుడిని బండబూతులు తిట్టిండు. ఆ ఆడియో రికార్డు కింద ఉంది వినండి. మిగతా వివరాలు కింద చదవండి.

"

యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో కృష్ణారెడ్డి అనే రైతు ఐదు సంత్సరాల క్రితం తనకున్న ఆరు ఎకరాల భూమిలో ఒక మూలకు అంటే 5 గుంటల జాగాలో కోళ్ల ఫారం కట్టుకున్నాడు. 5 గుంటల భూమి తప్ప కతిమ్మదంతా సాగు చేసుకుంటున్నాడు కృష్ణారెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కోళ్ల పరిశ్రమను వ్యవసాయానికి అనుబంధం చేశాడు.

కానీ రైతు బంధు పథకం కింద తనకు ఆరు ఎకరాల్లో 5 గుంటలు పోను మిగతా భూమికి చెక్కు వస్తదని అనుకున్నాడు. కానీ చెక్కు రాలేదు. కోళ్ల ఫారం ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు రైతుబంధు చెక్కు ఆపినట్లు ఆయనకు తెలిసింది. చెక్కు ఇప్పించాలంటూ స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి దగ్గరకు పోయిండు. తన సమస్యను ఎమ్మెల్యేలకు వివరించాడు.

సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి నీ సమస్య అలా ఎలా చెబుతావంటూ టిఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య నోటికొచ్చినట్లు బూతులు తిట్టిండు. ఆ కర్రె వెంకటయ్య సతీమణి యాదగిరిగుట్ట జెడ్పీటిసి కూడా (ఫొటోలో ఇద్దరూ ఉన్నారు).

సొంత కార్యకర్తను అయిన తనకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకే అన్న బూతులు తిట్టడమేంటని రైతు బాధపడుతున్నాడు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తకే ఇలాంటి పచ్చి బూతులు ఉంటే,మరి సామాన్యుని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాడు. రైతును బండబూతులు తిట్టిన జెడ్పీటిసి భర్త, మండలపార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.