Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్‌కు షాక్: టీఆర్ఎస్ వశమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ

నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఎన్నికల ప్రక్రియ నుండి కాంగ్రెస్  వాకౌట్ చేసింది. 

TRS got Nereducherla municipal chairman post
Author
Nalgonda, First Published Jan 28, 2020, 12:21 PM IST

హైదరాబాద్: నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఎన్నికల ప్రక్రియ నుండి  కాంగ్రెస్ పార్టీ  మంగళవారం నాడు వాకౌట్ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఎన్నిక ప్రక్రియపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

also read:నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: గందరగోళం, 'ఆత్మహత్య చేసుకొంటాం'

సోమవారం నాడు జరగాల్సిన నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. రాత్రికి రాత్రే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పేరును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు నమోదు చేశారు. శేరి సుభాష్ రెడ్డికి ఓటు కల్పించడంతో టీఆర్ఎస్ బలం 11కు చేరింది. కాంగ్రెస్ పార్టీకి 10 మంది సభ్యుల సంఖ్య చేరింది.

మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే సోమవారం నాడు మున్సిపల్ ఛైర్మెన్ ప్రక్రియ కొనసాగించకుండా ఎందుకు అడ్డుకొన్నారో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. శేరి సుభాష్ రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా  మున్సిపల్ ఛైర్మె్న ఎన్నికను నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకొంటామని కాంగ్రెస్ కౌన్సిలర్లు బెదిరించారు. 

Also read:నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: శేరి సుభాష్ రెడ్డికి ఓటు, కాంగ్రెస్ అభ్యంతరం

మరో వైపు  మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియను కొనసాగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.కాంగ్రెస్ పార్టీ సభ్యుల డిమాండ్ ను ఎన్నికల అధికారి పట్టించుకోకపోవడంతో  కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎన్నికల ప్రక్రియ నుండి వాకౌట్ చేశారు.దీంతో టీఆర్ఎస్ సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్మెన్, వైఎస్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది.నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ గా జయబాబు, వైస్ ఛైర్మెన్ శ్రీలత ఎన్నికయ్యారు.

మరో వైపు ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నేరేడుచర్ల సెంటర్‌లో ధర్నాకు దిగారు.  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి నేరేడుచర్ల మున్సిపాలిటీ వస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని టీఆర్ఎస్‌కు కోల్పోయింది. ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్, నేరేడుచర్ల మున్సిపాలిటీని కూడ ఇవాళ కోల్పోయింది. ఈ ఎన్నిక ప్రక్రియపై న్యాయపోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios