నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్  ఎన్నిక  సందర్భంగా మంగళవారం నాడు రసాభాస చోటు చేసుకొంది.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి  ఓటు హక్కు కల్పించడంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  అభ్యంతరం వ్యక్తం చేశారు. 

శేరి సుభాష్ రెడ్డిని సమావేశం నుండి బయటకు పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఎన్నిక నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకొంటామని కాంగ్రెస్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు.

Also read:నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: శేరి సుభాష్ రెడ్డికి ఓటు, కాంగ్రెస్ అభ్యంతరం

నేరేడుచర్ల మున్సిపాలిటీలో  15 వార్డులకు గాను టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7 వార్డులను కైవసం చేసుకొంది. సీపీఎం ఒక్క వార్డులో విజయం సాధించింది. సీపీఎం కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ప్రకటించింది. ఎక్స్‌అఫిషియో సభ్యుల బలంతో నేరేడుచర్ల మున్సిపాలిటీని గెలుచుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలను ప్రారంభించింది.

ఎంపీ  బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. అయితే ఈ నెల 27వ తేదీన జరగాల్సిన మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక వాయిదాపడింది. 

దీంతో మంగళవారం నాడు ఎన్నికను నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ఉదయం నాటికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ నెల 25వ తేదీ రాత్రికే ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్ల నమోదు పూర్తైందని కాంగ్రెస్ చెబుతోంది. మంగళవారం నాడు మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకొంటున్నారు. మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

సోమవారం నాడు టీఆర్ఎస్ సభ్యులు  పేపర్లను చింపితే ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నించారు. సోమవారం నాడే మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికను ఎందుకు నిర్వహించకుండా వాయిదా వేశారో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.నిబంధనలకు విరుద్దంగా  మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకొంటామని కాంగ్రెస్ సభ్యులు బెదిరిస్తున్నారు.