ఖమ్మం జిల్లా వేంసూరులో ఆదివారం పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటీ తన వర్గీయులకు భరోసానిచ్చేలా మాట్లాడారు.
ఖమ్మం: ఎప్పటికైనా ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లాల్సిందే అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలో వున్నానని... భవిష్యత్ లో కూడా ఇదే పార్టీలో కొనసాగుతానంటూ పొంగులేటి స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా వేంసూరులో ఆదివారం పర్యటించిన మాజీ ఎంపీ తన వర్గీయులకు భరోసానిచ్చేలా మాట్లాడారు. అధికారం చేతిలో వుందికదా అని కొందరు తన వారితానేని ఇబ్బందులకు గురిచేస్తున్నారని... అయితే వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసన్నారు. తానేమీ అసమర్థుడిని కానని... తన వారిని ఇబ్బందిపెట్టిన వారు ప్రతిఫలం అనుభవించాల్సిన రోజు వస్తుందన్నారు.చక్రవడ్డీతో సహా అనుభవించాల్సి వుంటుందంటూ పొంగులేటి హెచ్చరించారు.
ప్రజల అభిమానమే తనకు చాలా పెద్ద పదవి అని... అంతకంటే పెద్దపదవి ఏదీ లేదన్నారు. పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని... పోయేటప్పుడు కాంక్రీట్ గోడలు కట్టినా లాభం ఉండదని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరి సొత్తూ కాదని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలనుకుంటే అది ఇస్తారని పొంగులేటి తెలిపారు.
తాను ప్రస్తుతం ప్రజాప్రతినిధిని కానని... కాబట్టి ఎవరి పర్మీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులపై కక్షపూరితంగా వ్యవహరించడం మానుకోవాలని పొంగులేటి సూచించారు.
