హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నిప్పులు చెరిగారు. పచ్చకామెర్ల వాడిలా కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఇకపోతే ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమీషన్ల కోసమే సచివాలయ నిర్మాణం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. సచివాలయ నిర్మాణంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బూరనర్సయ్య గౌడ్ పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టుగా కోమటి‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

ఎంపీ కోమటిరెడ్డిదే కమీషన్ల బతుకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంల దగ్గర ప్రాజెక్టు‌లు తెచ్చుకుని కమీషన్ల బొక్కిన చరిత్ర కోమటి‌రెడ్డికే ఉందని తమకు లేదన్నారు. సచివాలయ నిర్మాణంపై నేడు విమర్శించిన వారే భవిష్యత్ లో కట్టడాలు పూర్తయిన తర్వాత వాటి ముందు ఫోటోలు దిగడం ఖాయమన్నారు. 

అప్పులు తెలంగాణ అంటూ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలను సైతం బూర నర్సయ్య గౌడ్ ఖండించారు. ప్రభుత్వాలు అప్పులు చేయడం అత్యంత సహజమన్నారు. అప్పులు చేసినా 68 శాతం మౌలిక రంగాలపైనే తెలంగాణ వెచ్చిస్తోందన్నారు. తెలంగాణ మిషన్ భగీరథను చూసే కేంద్రం జలశక్తి శాఖ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రజా అవసరాల కోసం అప్పులు చేస్తే తప్పేమీ లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.