అయిదొందల వేయి పాత నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన ఆక్రోష్ దివస్  భారత్‌బంద్‌కు  తాము మద్దతునీయడం లేదని  టీఆర్ఎస్ కరీంనగర్ లోక్ సభసభ్యుడు బి. వినోద్ కుమార్  స్పష్టం చేశారు.


శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణా భవన్ లో  మాట్లాడుతూ పార్లమెంటులో నోట్ల రద్దు చర్చపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధిలేదన్నారు. వారి ప్రవర్తన వల్ల పార్లమెంటు స్తంభించి పోతున్నదని సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని ఆయన చెప్పారు.

 

తెలంగాణా అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు  తమ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని చెబుతూ సీట్లు  పెంచేందుకు విభజన చట్టంలో స్పష్టమయిన ప్రస్తావన ఉన్న విషయాన్ని వినోద్ గుర్తు చేశారు.

 

 తెలంగాణలో శాసనసభ స్థానాలను 153కు పెంచాలని సెక్షన్ 26లో ఉందని,  సెక్షన్ 26 ప్రకారం తప్పనిసరిగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచడం కేంద్రం బాధ్యత అని ఆయన  అన్నారు.

 

‘అసెంబ్లీ స్థానాలు పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా అసెంబ్లీ స్థానాలు పెంచాలని హర్యానా విషయంలో సుప్రీంకోర్టు  తీర్పు చెప్పింది.  రాష్ర్టాలు ఏర్పడినప్పుడు ఆర్టికల్ 4 కింద అసెంబ్లీ స్థానాలు పెరగాలి,’ అని వినోద్ చెప్పారు. అందువల్ల  టిఆర్ ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసి కేంద్రం మీద వత్తిడి పెంచుతుందని కూడా ఆయన చెప్పారు.