తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య వార్ తారా స్థాయికి చేరింది. రెండు పార్టీల నేతల మధ్య ట్విట్టర్ వేదిక ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య వార్ తారా స్థాయికి చేరింది. రెండు పార్టీల నేతల మధ్య ట్విట్టర్ వేదిక ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ప్రకటించారు. అయితే ఇందుకు కౌంటర్‌గా ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు ట్వీట్స్ చేశారు.
అయితే రాహుల్ గాంధీ ట్వీట్‌పై కౌంటర్‌గా కవిత, హరీశ్ స్పందించగానే.. సీన్‌లోకి రేవంత్ ఎంటరయ్యారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని, సెంట్రల్ హోల్‌లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోందని హరీష్ రావుపై సెటైర్లు వేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకొని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన తమ నేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తొలుత రాహుల్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. దశాబ్దాలుగా దేశంలోని రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ముందుగా వారికి క్షమాపణ చెప్పాలని వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును పోల్చడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.
“మీ పార్టీకి ఈ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించే అవకాశం లభించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు కష్టాలు, ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. రైతులకు 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయింది. మేము తెలంగాణలో రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలను తీసుకొచ్చాం. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, నీటిపారుదలపై దృష్టి సారించి మా గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. 50 ఏళ్లలో మీ పార్టీ చేయలేనిది మా ప్రభుత్వం 7 ఏళ్లలో అందించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చడం మీ పార్టీకి అవమానం కలిగిస్తుంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ కామెంట్స్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి.. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్‌కి ఉన్న నిబద్ధత మీకు తెలియకపోవడం బాధాకరమని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. తమ పార్టీ చేసిన కృషి గురించి మీ తండ్రి కేసీఆర్‌ను అడగటం మంచిందని కేటీఆర్‌కు సూచించారు. ఓహో.. రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండొచ్చని ఎద్దేవా చేశారు.
దేశంలోని రైతుల అభివృద్ది కోసం హరిత విప్లవం, వ్యవసాయ సీలింగ్ చట్టం, భూమిలేని పేదలకు అసైన్‌మెంట్ భూములు, ఎంఎస్పీ, నిత్యావసర వస్తువుల చట్టం, పీడీఎస్, 70 వేల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, MGNREGA, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత పథకాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల కలను నెరవేర్చామని చెప్పారు. తాము రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ తీసుకొస్తే.. మీ ప్రభుత్వం 7000కు పైగా రైతులను మరణాలకు కారణమైందని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరాకరించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్, బీజేపీతో కలిసి ఫిక్స్‌డ్ బ్లేమ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాము ఆర్టీఈ (విద్య హక్కు చట్టం), ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం)ని కూడా తీసుకొచ్చామని.. తద్వారా దేశ ప్రజలు మీలాంటి ప్రభుత్వాలను ఎల్లవేళలా జవాబుదారీగా ఉంచగలుగుతారని రేవంత్ అన్నారు. డోంట్ వర్రీ కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.
