సూర్యాపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య ఆధిపత్యపోరు బయటపడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. కొన్నిచోట్ల మాటల తూటాలతో సరిపెట్టుకుంటుంటే కొన్ని చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 

తాజాగా సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీల మధ్య ఉన్న ఆధిపత్యపోరు భౌతిక దాడులకు తెరతీసింది. ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ విబేధాలు ఎన్నికల ప్రచారం సందర్భంగా బయటపెట్టారు. ఒక స్థలం వివాదాన్ని బూచిగా చూపించి ఇరువర్గాలు భౌతిక దాడులకు తెగబడ్డాయి. 

సుమారు అరగంట పాటు ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు విరచుకుపడ్డారు. మహిళలు సైతం ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డాడు. పురుషులు సైతం మహిళలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రఘునాథపాలెంలో అరగంట సేపు యుద్ధవాతావరణాన్ని తలపించింది. 

రోడ్లన్నీ రాళ్లు, కర్రలతో నిండిపోయాయి. రోడ్లు నెత్తురోడాయి. అయితే కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. గొడవకు కారణమైన 20 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే పాత కక్షలే గొడవలకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.