పెబ్బేరులో చిన్నారెడ్డి తో వాగ్వాదం, దాడి రైతు సమన్వయ సమితి సమావేశంలో ఘర్షణ
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి టిఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో టిఆర్ఎస్ నేతలు ఆయనపై దాడికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరులో రైతు సమన్వయ సమితి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు సమాచారం లేకుండా రైతు సమన్వయ సమితి జాబితా ఎలా తయారు చేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా జాబితా తయారు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ జాబితాను తనకు ఇవ్వాలని అధికారులను కోరారు.
కానీ అధికారులు ఆ జాబితా చిన్నారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించారు. మీరు లిస్ట్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చిన్నారెడ్డి ఖరాఖండిగా చెప్పారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. వెంటనే జోక్యం చేసుకున్న టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. దీంతో సమావేశంలో రభస నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం చిన్నారెడ్డి వనపర్తి పట్ణణంలో జిఓ 39కి వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు అక్కడినుంచి వనపర్తి వెళ్లారు.
లిస్టు అడిగినందుకే దాడి : చిన్నారెడ్డి
తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే జాబితా తయారు చేయడం ఎంతవరకు సమంజసమని చిన్నారెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ వాళ్లు లిస్టు తయారు చేసినా దాన్ని నాకు ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావడంలేదన్నారు. ఆ లిస్టు అడిగినందుకే తనపై దాడికి పాల్పడ్డారని చిన్నారెడ్డి ‘ఏసియా నెట్’ కు తెలిపారు. అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం చేస్తున్నారనడానికి నా నియోజకవర్గంలోని పెబ్బేరులో తయారు చేసిన రైతు సమన్వయ సమితి లిస్టు ప్రత్యక్ష ఉదాహరణ అని చిన్నారెడ్డి తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
