హైదరాబాద్: హైద్రాబాద్ వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన బావ మరింది జయప్రకాష్ రెడ్డిలు అక్రమ కట్టడాలు కడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గోపన్‌పల్లిలో దళితుల భూములను రేవంత్ రెడ్డి లాక్కొన్నాడన్నారు. ఈ విషయమై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

also read:తప్పుడు ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటా: ఎన్జీటీ నోటీసులపై కేటీఆర్

ఎదుటివాడిపై బురద చల్లడం రేవంత్ రెడ్డికి అలవాటేనని ఆయన ఆరోపించారు. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 66/ఈ లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన బావమరిది జయప్రకాష్ రెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు.ఈ విషయమై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు 111 జీవో పరిధిలో భూములు ఉన్నాయనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామన్నారు. రేవంత్ రెడ్డి చూపిన భూములు కేటీఆర్‌కు చెందినవి కావన్నారు. కేటీఆర్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలకు దిగారన్నారు. రేవంత్ వ్యవహరాలను ఇంకా బయటకు వస్తాయని ఆయన చెప్పారు.వట్టినాగులపల్లిలోని భూముల విషయంలో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంచలనాల కోసం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడుతారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమైందిగా పేర్కొన్నారు.జాతీయ పార్టీ కి ఇలాంటి నాయకుడి అవసరం ఉందా..? ఆలోచించాలని ఆయన కోరారు. 

తామంతా ధర్మానికి కట్టుబడి ఉన్నామన్నారు. కోర్టులంటే తమకు  గౌరవం ఉందన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే... రేవంత్ టీం అంతా మరోవైపు ఉందన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయాలను మాట్లాడడం మానుకోవాలని ఆయన సూచించారు.  111  జీవో పరిధిలో తమ పార్టీ నాయకుల ఫార్మ్ హౌస్ లు ఉన్నాయని  వీహెచ్ మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు. 

ఈ విషయమై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 111 జీవో లో పెద్ద బంగ్లా కట్టుకుంది రేవంత్ రెడ్డేనని ఆయన చెప్పారు.  దొంగనే దొంగ అన్నట్టుగా  రేవంత్ వ్యవహారం ఉందన్నారు.