ఓ ట్రాన్స్ జెండర్ హత్యకు గురయ్యింది. ఆమె మీద ఆమె స్నేహితుడే దాడి చేశాడు. బోనాల పండుగ కోసం సంగారెడ్డికి వెళ్లిన ఆమె.. తీవ్రగాయాలతో చందానగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది.

సంగారెడ్డి : స్నేహితుడి దాడిలో ట్రాన్స్ జెండర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొండాపూర్ మండలం మరేపల్లీలో ట్రాన్స్ జెండర్ దీపిక మీద స్నేహితుడు సాయి హర్ష దాడి చేశాడు. తీవ్ర గాయాలతో హైదరాబాద్ చందానగర్ లోని ప్రైవేటు ఆసపత్రిలో చికిత్స పొందుతూ దీపిక ప్రాణాలు కోల్పోయింది. దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు ఆమెది హత్య అని తేల్చారు. 

గురువారం రోజు బోనాల పండుగ కోసం అంబర్ పేటకు చెందిన ట్రాన్స్ జెండర్ దీపిక సంగారెడ్డి వెళ్లినట్లు తెలుస్తోంది. దీపిక హత్య మీద డీఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్ ను ఎల్బీనగర్ కు చెందిన సాయి హర్ష హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

దారుణం.. పులివెందులలో హిజ్రాపై పదిమంది అత్యాచారం...

ఇదిలా ఉండగా, పులివెందులలో హిజ్రాపై (50) అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత హిజ్రా 13 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బుధవారంనాడు దిశ యాప్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే దీని మీద దర్యాప్తు చేపట్టారు. పులివెందులకు చెందిన పీ చక్రధర్, కే చలపతి, ఏ బాల గంగిరెడ్డి, పి గురు ప్రసాద్, కే కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి. జయచంద్ర శేఖర్ రెడ్డి, ఎం హరికృష్ణరెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ఓ ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర, షాకీర్, సుభాష్.. లు నిందితులుగా గుర్తించారు. 

వీరు ఓ పంచాయతీ కోసం సత్య జిల్లా రాగన్నగారిపల్లెకు రెండు వాహనాల్లో వెళ్లారు. తిరిగి పులివెందులకు వస్తూ.. కదిరి రహదారిలోని గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలించారు. కదిరి రహదారిలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో చక్రధర్, చలపతి, బాలగంగి రెడ్డి, గురు ప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయ చంద్రశేఖర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి కనిపించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో హిజ్రాపై పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం ఓ హిజ్రా (35) పట్టణంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. రెండు రోజుల కిందట పదిమంది ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది.