Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు..స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ ప్లేస్‌లు ఇవే..

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

Traffic restrictions in hyderabad ahead of Ind-Aus T20I on today
Author
First Published Sep 25, 2022, 10:39 AM IST

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రమే ఇరుజట్లు నగరానికి చేరుకున్నాయి. మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియంతో పాటు, క్రికెటర్లు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశారు. అక్కడి నుంచి నిరంతం పర్యవేక్షణ జరగనుంది. 

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాగోల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్, ఎన్‌ఎఫ్‌సి బ్రిడ్జి, హబ్సిగూడ, అంబర్‌పేట్ వైపు నుంచి ఉప్పల్ వైపు భారీ వాహనాలకు అనుమతి ఉండదు. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. 

ఇక, క్రికెట్ అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు బస్సులను నడపనున్నట్టుగా గ్రేటర్ ఆర్టీసీ తెలిపింది. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్టుగా అధికారులు తెలిపారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు ప్రజారవాణానే ఎక్కువగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

21 పార్కింగ్ ప్లేస్‌లు.. 
స్టేడియం చుట్టూ 7.5 కి.మీ మేర పుట్‌పాత్‌లపై పార్కింగ్ చేసుకునేందుకు పోలీసులు వెసులుబాటు కల్పించారు. స్టేడియం చుట్టూ దాదాపు 21 పార్కింగ్ ప్రాంతాలను అందుబాటులో ఉంచనున్నారు. పార్కింగ్‌కు సంబంధించి సూచనలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్టుగా  పోలీసులు తెలిపారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్ రోడ్‌లో వచ్చేవారు వారి వాహనాలను ఎన్‌‌జీఆర్ఐ గేట్ నెంబర్-1 నుంచి గేట్ నెంబర్ -3, స్టేడియం మెట్రో పార్కింగ్ వరకు ఎడమ వైపున పార్క్ చేయాలి.

-ఉప్పల్ నుంచి హబ్సిగూడ రోడ్డు వైపు వచ్చే వాహనదారులు వారి వాహనాలను జెన్‌పాక్ట్ సర్వీస్ రోడ్‌లో హిందూ ఆఫీస్ లేన్ వైపు, జెన్‌పాక్ట్ నుంచి ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్ వరకు ఎడమవైపు పార్క్ చేయాలి.

-ఉప్పల్ నుంచి రామాంతపూర్, రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే ఫోర్ వీలర్ వాహనదారులు తమ వాహనాలను సినీపోలీస్ సెల్లార్‌లో, మోడ్రన్ బేకరీ లోపల, శక్తి డిటర్జెంట్ ఓపెన్ ప్లేస్‌లో, డీఎస్‌ఎల్ ఓపెన్ ల్యాండ్ (ఎన్‌ఎస్‌ఎల్/ఎరీనా ఎదురుగా), ఏవియా మెరియా ఇంటర్నేషనల్ స్కూల్ (చర్చ్) లోపల పార్క్ చేయాలి.

-ఉప్పల్ నుంచి రామాంతపూర్, రామాంతపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే టూ వీలర్ వాహనదారులు తమ వాహనాలను మోడరన్ బేకరీ, అమ్మ భగవాన్ సేవా లేన్, ఈనాడు ఆఫీస్ లేన్, కేవీ స్కూల్ నుంచి డీఎస్‌ఎల్, ఎల్‌జి గోడౌన్ నుంచి ఎన్‌ఎస్‌ఎల్ బిల్డింగ్ వరకు పక్కనే ఉన్న సందులలో పార్క్ చేయవచ్చు.  ఇక, అలాగే.. ఉప్పల్‌ జంక్షన్‌-జెన్‌పాక్ట్‌ మధ్య ప్రధాన మార్గంలో పార్కింగ్‌ చేయరాదని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. 

 

వీఐపీల వాహనాల పార్కింగ్ ఇలా.. 
వీవీఐపీలు, వీఐపీలు గేట్ నెంబర్ 1 నుంచి స్టేడియంలోని ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. వీరి వాహనాలను స్టేడియం సమీపంలోని ఏ, సీ పార్కింగ్‌ ప్రదేశాలలో పార్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ, సి పార్కింగ్ ఉన్న వాహన పాస్ హోల్డర్లు హబ్సిగూడ - ఉప్పల్ రహదారిని మాత్రమే ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

-తార్నాక వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్లు స్టేడియంలోకి ప్రవేశించడానికి హబ్సిగూడ - ఎన్‌జిఆర్‌ఐ - ఏక్ మినార్ రైట్ టర్న్ - గేట్ నంబర్ - 1 వైపు వెళ్లాలి. వారు వాహనాలను ఏ, సీ పార్కింగ్ స్లాట్‌లలో పార్క్ చేయాలి. 

-అంబర్‌పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్‌లు దూరదర్శన్ - రామంతపూర్ - స్ట్రీట్ నెం.8  లెఫ్ట్ టర్న్ తీసుకుని గేట్ నెం-1 వైపు వెళ్లి స్టేడియంలోకి ప్రవేశించాలి. వారు వాహనాలను ఏ, సీ పార్కింగ్ స్లాట్‌లలో పార్క్ చేయాలి. 

-నాగోల్, వరంగల్ హైవే వైపుల నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్లు ఉప్పల్ ఎక్స్ రోడ్ - సర్వే ఆఫ్ ఇండియా - ఏక్ మినార్ - లెఫ్ట్ టర్న్ - గేట్ నంబర్ -1 స్టేడియంలోకి ప్రవేశించాలి.  వారు వాహనాలను ఏ, సీ పార్కింగ్ స్లాట్‌లలో పార్క్ చేయాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios