హైదరాబాద్ లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు చెక్

Traffic problem will be solved with this new method
Highlights

తెలంగాణ సర్కారు కొత్త పరిష్కారం

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్,పార్కింగ్ సమస్యల పరిష్కారానికి పి.పి.పి (Public Private Partnership) పద్ధతిలో మల్టిలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి  నెల లోగా ఔత్సాహికుల నుండి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ను పిలవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. బుధవారం సచివాలయంలో మల్టిలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణంపై నగర మేయర్ బొంతురామ్మోహన్ తో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్  కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్, మెట్రోరైల్ యండి ఎన్.వి.యస్ రెడ్డి, లా సెక్రటరీ శ్రీ నిరంజన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, TSIIC MD శ్రీ వెంకట నర్సింహ్మారెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, స్పోర్ట్స్ యం.డి దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్ధలాలలో మల్టిలెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో స్టడీ చేయించాలన్నారు. నగరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాలలో పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాలలో ఆయాశాఖలు తమ అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్ ను యూనిక్ గా అభివృద్ధి చేయాలని, వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారిగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ విషయాలన్నీ Terms of Reference లో పేర్కొనాలన్నారు. తదనంతరం RFP కి వెళ్ళాలన్నారు.

హైదరాబాద్ నగర మేయర్ బొంతురామ్మోహన్ మాట్లాడుతూ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.టి రామారావులు దృఢ సంకల్పంతో  ఉన్నారని ఇప్పటికే పలుసార్లు సమావేశాలు నిర్వహించి దిశా నిర్ధేశం చేశారన్నారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలల్లో వినియోగిస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరించడంతోపాటు, వివిధ పరిశ్రమలు, విద్యాసంస్ధలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని నగరంలో ఎన్నో మౌళిక వసతుల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు. 100 గజాల నుండి 500 గజాల లోపు స్ధలాలలో చైన్ పార్కింగ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. న్యూయార్క్ లాంటి నగరంలో పార్కింగ్ ద్వారా ఎంతో ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మొదటి దశలో ప్రభుత్వ స్ధలాల్లో పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు.

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ నగర ట్రాఫిక్ పై పోలీస్ శాఖ ఇప్పటికే అధ్యయనం చేసిందని, స్ధలాన్ని బట్టి ప్రత్యేక డిజైన్లను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ స్ధలాలలో ఆయాశాఖలు తమ అవసరాలను ప్రతిపాదనలలో పేర్కొనాలని అన్నారు. డిల్లీలోని సరోజినీ నగర్ లో డి.ఎల్.ఎఫ్ ద్వారా స్మార్ట్ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారని సి.యస్ కు తెలిపారు.

మెట్రొరైల్ యం.డి ఎన్.వి.యస్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వివిధ శాఖల సహకారాన్ని అందించాలని, HMRL నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని అన్నారు. జర్మనీ, జపాన్, చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలలో అత్యుత్తమ టెక్నాలజీ వినియోగిస్తూ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాన్ని చేపట్టారని, మన నగరంలోను పి.పి.పి పద్ధతిలో నూతన టెక్నాలజితో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతామన్నారు.

loader