Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి జిల్లాలో కూలీల మరణానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

ట్రాక్టర్ నడిపింది 60 ఏళ్ల వృద్దుడు...

tractor driver was Driving With His Feet When Tractor Fell Into Musi Canal Near Veligonda

తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపిన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మారణహోమానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ ట్రాక్టర్ డ్రైవర్ సిగరెట్ ముట్టించుకోడానికి ట్రాక్టర్ స్టీరింగ్ వదిలి డ్రైవ్ చేయడంతోనే వాహనం అదుపు తప్పి మూసీ కాలువలో పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే కూలీలు ప్రయాణించిన ట్రాక్టర్ కండీషన్ కూడా మరో కారణంగా తెలుస్తోంది.

జిల్లాలోని వలిగొండ మండలం వేముల కొండకు చెందిన వెంకట నారాయణ(60) ఇతరుల దగ్గర భూమి కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు.  ఇలా ఈ సంవత్సరం తీసుకున్న భూమిలో పత్తి పంట వేయడానికి సిద్దమయ్యాడు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంట వేయడానికి ఇదే తగిన సమయమని భావించిన నారాయణ, 30 మంది కూలీలను పత్తి విత్తనాలు వేసేందుకు సిద్దం చేశాడు.

అయితే తన దగ్గర కండీషన్ లో లేక యూలనపడిన ట్రాక్టర్ ని ఈ కూలీలను పొలానికి తీసుకెళ్లడానికి బైటికి తీశాడు వెంకనారాయణ. ఇతడు డ్రైవింగ్ చేయగా ఇంజన్ పై ఐదుగురు, ట్రాలీలో మరో 25 మంది కూర్చున్నారు. వీరంతా ఎంతో ఆనందంగా ముచ్చటిస్తూ  వెళుతుండగా హటాత్తుగా ఈ ప్రమాదం జరిగింది. 

అయితే ట్రాక్టర్ అదుపు తప్పడంతో ట్రాలీతో పాటు మూసీ కాలువలో తిరగబడింది. దీంతో ఈ ట్రాలీకింద నుండి నీటిలోంచి బైటికి రాలేక చాలామంది మృతి చెందారు. అలాగే ఈ కాలువలోని గుర్రపు డెక్క కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. ఇవి ఇరుక్కుని కూడా కొందరు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన కూలీల్లో ఓ బాలుడు మినహా మిగతావారంతా మహిళలే.  జడిగె మారమ్మ( 55), ఎనుగుల మాధవి (26), బందారపు స్వరూప (35),పంజాల భాగ్యమ్మ (27), బీసు కవిత (27), కాడిగల్ల లక్ష్మమ్మ (35), మనీషా (18), కాడిగల్ల నర్మద( 25), ఇంజమూరి శంకరమ్మ (30), ఇంజమూరి నర్సమ్మ (50),అంబాల రాములమ్మ(50), అరూరు మణెమ్మ (30), గన్నెబోయిన అండాలు( 35), బోయ శంకుతల(23) లతో పాటు మల్లిఖార్జున్‌ (4) అనే చిన్నారి మృతిచెందాడు.

 ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బైటపడినప్పటికి చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ ప్రమాదానికి కారణమైన వెంకటనారాయణ మాత్రం ప్రాణాలను కాపాడుకున్నాడు. అతడు ప్రమాదాన్ని ముందే గుర్తించి వాహనంలోంచి బైటికి దూకాడు. అయితే ఇతడి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios