పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద విషాదం చోటు చేసుకుంది. సొరంగం పై కప్పు కూలి ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. అతడి తలమీద రాళ్లు పడడంతో స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం.
నాగర్ కర్నూల్ : పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద సొరంగం పై కప్పు కూలి ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాల వాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి (38) ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం పనుల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ నడుపుకుంటూ నలుగురు కార్మికులతో కలిసి సొరంగంలోకి వెళ్లారు.
మధ్యలో నీరు నిలవడంతో కార్మికులు పైపుల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి తలపై రాళ్ళు పడ్డాయి. తీవ్రగాయాలైన ఆయన తిరిగి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 8న డెహ్రాడూన్ లో ఓ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను ఒక ఫోన్ కాల్ ద్వారా రక్షించారు. ఉత్తరాఖండ్లో ఫిబ్రవరిలో అలకనందా, ధౌనిగంగా నదులకు మెరుపు వరదలు వచ్చాయి. ఆ సమయంలో ntpc పవర్ ప్లాంట్ వద్ద సొరంగంలో వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు సొరంగం నుంచి బయటకు రావాలని కార్మికులను పిలిచారు.
అయితే కార్మికులు బయటకు వచ్చే లోపుగానే బురద, నీరు వచ్చి చేరింది. దీంతో చమోలిలోని తపోవన్ సొరంగంలో వీరంతా చిక్కుకుపోయారు. ఈ కార్మికుల్లో ఒక్క కార్మికుడి ఫోన్ కి మాత్రం సెల్ సిగ్నల్ కనెక్ట్ అయింది. వెంటనే ఆయన పవర్ ప్లాంట్ మేనేజర్ కు సొరంగంలో తాము చిక్కుకుపోయినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే మేనేజర్ ఐటిబిపి అధికారులకు సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
దీనిమీద ఆ కార్మికుడు మాట్లాడుతూ... 300 మీటర్ల లోతులో ఉన్న తమకు ఒక వైపు నుండి గాలి, వెలుతురు రావడంతో కొంత ధైర్యం వచ్చిందని ఆయన తెలిపారు. ఎట్టకేలకు సొరంగం నుంచి కార్మికులను బయటకు తీశారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన 12 మంది కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా నిరుడు ఏప్రిల్ 2న తూర్పు తైవాన్లోని ఒక సొరంగంలో 350 మందితో వెడుతున్న రైలు పట్టాలు తప్పింది. దీంతో కనీసం 36 మంది మృతి చెందారు మృతుల సంఖ్య లో గాయపడ్డ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టైటుంగ్ కు వెడుతున్న ఎనిమిది భోగీల ఈ రైలు శుక్రవారం ఉదయం హువాలియన్ కు ఉత్తరాన ఉన్న సొరంగంలోకి ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగింది. రైలు సొరంగంలోకి సగం వెళ్లగానే పట్టాలు తప్పడంతో భోగీలు సొరంగం గోడలకు కొట్టుకుని ప్రమాదం తీవ్రమయింది. దీంతో సహాయకసిబ్బంది లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని ప్రభుత్వం నడుపుతున్న కేంద్ర వార్తా సంస్థ అగ్నిమాపక విభాగాన్ని ఉటంకిస్తూ నివేదించింది.
ఇప్పటికే ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ తో సహా, 35 మంది ప్రయాణికులు మరణించినట్లు తైవాన్ ప్రీమియర్ సు-సెంగ్-చాంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో 81 మంది గాయపడ్డారు, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది ఇంకా భోగీల్లో చిక్కుకుపోయి ఉన్నారు. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ మాత్రం సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుపుతుంది.
